CM Revanth Reddy: పాలమూరుపై కేసీఆర్ నిర్లక్ష్యం
ABN , Publish Date - Nov 11 , 2024 | 03:29 AM
మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపడం వల్లే తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు సార్లు సీఎంగా పనిచేసే అవకాశం కేసీఆర్‌కు వచ్చిందని.. కానీ, ఆయన ఈ ప్రాంత అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా చేశారు. ఆరు దశాబ్దాల తర్వాత మళ్లీ పాలమూరు వ్యక్తికి సీఎంగా అవకాశం వచ్చింది. దయచేసి పాలమూరు అభివృద్ధికి అడ్డుపడొద్దు. నేను ఏ దేశంలో ఉన్నా.. ఎక్కడున్నా.. పాలమూరు ప్రాజెక్టులపై ప్రతి నెలా సమీక్ష చేస్తున్నా. వీటిని పూర్తి చేయకపోతే చరిత్ర నన్ను క్షమించదు.
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఈ ప్రాంత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు
ప్రాజెక్టులు పూర్తి చేయనందుకే ఇప్పటికీ వలసలు
ఇక్కడి ప్రజలకు నిధులివ్వాల్సిన బాధ్యత ఉంది
కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు
దయచేసి పాలమూరు అభివృద్ధికి అడ్డుపడకండి
కుట్రతో కాళ్లలో కట్టెలు పెడితే.. మట్టి మనుషుల
చెమటలో కొట్టుకుపోతారు: సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపడం వల్లే తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు సార్లు సీఎంగా పనిచేసే అవకాశం కేసీఆర్‌కు వచ్చిందని.. కానీ, ఆయన ఈ ప్రాంత అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల వలసలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి ఆలయంలో జరుగుతున్న బ్రహోత్సవాలకు ఆదివారం ఆయన హాజరయ్యారు. అక్కడ రూ.110 కోట్ల వ్యయంతో 3.7 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఎలివేటెడ్ ఘాట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రేవంత్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా పాలమూరు కూలీల చెమటతో కట్టిన ప్రాజెక్టులే ఉంటాయన్నారు.
ఈ ప్రాంత బిడ్డను సీఎంను చేసిన ప్రజల కోసం కచ్చితంగా నిధులు మంజూరు చేసి.. ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆలయాలతోపాటు నాడు నెహ్రూ చెప్పినట్లు ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్టులకూ నిధుల ప్రవాహం కొనసాగిస్తామని తెలిపారు. కృష్ణమ్మ తలాపున పారుతున్నా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రజలకు చుక్క నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించామని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. చిల్లరమల్లర రాజకీయాల కోసం అపర భగీరథ ప్రయత్నానికి వ్యతిరేకంగా కుట్రలు చేయొద్దని, కాళ్లలో కట్టెలు పెడితే.. మట్టి మనుషుల చెమటలో కొట్టుకుపోతారని బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. తనపై రాజకీయంగా కోపం ఉంటే.. మరో రకంగా తీర్చుకోవాలేగానీ.. అభివృద్ధికి అడ్డుపడొద్దని కోరారు.
కేసీఆర్ హయాంలో వారి ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నప్పుడు తాము ఏడవలేదని, బాధ అనిపించినా.. ఓర్చుకున్నామన్నారు. ఇప్పుడు తమకు అవకాశం వచ్చిందని, నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అయితే, పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తుంటే కొంతమంది దుర్మార్గులు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు. పాలమూరు ఆత్మగౌరవాన్ని అణచాలని చూస్తే యువత తిరగబడుతుందని స్పష్టం చేశారు. అంతకు ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు సీఎం ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా పని చేస్తున్నామని తెలిపారు. కురుమూర్తి స్వామి ఆలయం వద్ద ఎలివేటెడ్ ఘాట్‌రోడ్డుకు రూ.110 కోట్లను కేవలం నెల రోజుల్లోపే మంజూరు చేశామని, వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి రోడ్డును పూర్తి చేస్తామని అన్నారు. సీఎం వెంట మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, శ్రీహరి ఉన్నారు.