Share News

CM Revanth Reddy: నిర్వాసితుల్ని నష్టపోనివ్వం

ABN , Publish Date - Oct 09 , 2024 | 02:56 AM

హైదరాబాద్‌లో వర్షాలు, వరదల వల్ల ఏర్పడుతున్న కల్లోల పరిస్థితులను అరికట్టాలంటే కూల్చివేతలు తప్పవని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

CM Revanth Reddy: నిర్వాసితుల్ని  నష్టపోనివ్వం

  • ప్రత్యామ్నాయ నివాసాలు కల్పిస్తాం

  • సామాన్య ప్రజలకు, బడుగు, బలహీన

  • వర్గాల వారికి నష్టం జరగకుండా చర్యలు

  • వర్షాలు, వరదలతో హైదరాబాద్‌లో వచ్చే

  • కల్లోలాన్ని అరికట్టాలంటే కూల్చివేతలు తప్పవు

  • అసదుద్దీన్‌కు స్పష్టం చేసిన రేవంత్‌రెడ్డి

  • ఢిల్లీలో సీఎంను కలిసిన ఎంఐఎం అధినేత

న్యూఢిల్లీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో వర్షాలు, వరదల వల్ల ఏర్పడుతున్న కల్లోల పరిస్థితులను అరికట్టాలంటే కూల్చివేతలు తప్పవని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అయితే ఈ కూల్చివేతలతో నిర్వాసితులయ్యే వారికి న్యాయం చేస్తామన్నారు. వారికి ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లు కల్పించేందుకు ఇప్పటికే తగిన ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. సామాన్య ప్రజలకు, బడుగు, బలహీన వర్గాల వారికి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని సీఎం అధికార నివాసంలో తనను కలిసిన ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి ఈ విషయాన్ని రేవంత్‌ స్పష్టం చేశారు.


ఓవైపు హైడ్రా, మరోవైపు మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా చెరువులు, మూసీలో ఆక్రమణలను ప్రభుత్వం కూల్చివేస్తుండడంపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కాగా, హైడ్రా కూల్చివేతలను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న అసదుద్దీన్‌.. ముఖ్యమంత్రితో భేటీలో ప్రధానంగా ఈ అంశాన్నే ప్రస్తావించినట్లు తెలిసింది. కూల్చివేతల కారణంగా బలహీన వర్గాలకు చెందిన పేదలు, పేద ముస్లింలు రోడ్డున పడతారని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. పేదల ఇళ్ల కూల్చివేతపై పునరాలోచించాలని, వారికి నష్టం జరగని విధంగా ముందుకెళ్లాలని సీఎం రేవంత్‌ను ఆయన కోరినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.


హైడ్రా, మూసీ ఆక్రమణల కూల్చివేతల విషయంలో ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించాకే చర్యలు చేపట్టాలని కోరినట్లు పేర్కొన్నాయి. మూసీ సుందరీకరణతో నిర్వాసితులయ్యే వారిని ఎలా ఆదుకోవాలన్న దానిపైనా అసద్‌ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. కాగా, హైడ్రా కూల్చివేతలపై రెండు రోజుల క్రితం ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఎంతో ఆయన భేటీ ఆసక్తికరంగా మారింది. ఇక సీఎం రేవంత్‌ తన ఢిల్లీ పర్యటనను ముగించుకొని మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. హరియాణా ఎన్నికల ఫలితాలతో ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దలు నిరాశలో కూరుకుపోవడంతో సీఎం రేవంత్‌ వారితో భేటీ కాలేకపోయారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చలు మళ్లీ వాయిదా పడ్డాయని తెలుస్తోంది.

Updated Date - Oct 09 , 2024 | 02:56 AM