Share News

CM Revanth Reddy: అక్షరవీరుడి మరణం తీరని లోటు..

ABN , Publish Date - Jun 09 , 2024 | 03:31 AM

ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్‌ గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకున్నారు.

CM Revanth Reddy: అక్షరవీరుడి మరణం తీరని లోటు..

  • రామోజీరావు మరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్ర్భాంతి

  • రామోజీరావు నిజమైన లెజెండ్‌ : గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్‌ గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకున్నారు. రామోజీ కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్‌ ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. కాగా రంగం ఏదైనా విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేసిన వ్యక్తి రామోజీరావు అని సీఎం అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మీడియా రంగానికి దశాదిశ చూపిన దార్శనికుడు రామోజీరావు అన్నారు.


రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతో భేటీ అయిన క్షణాలను రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాగా, రామోజీరావు గొప్ప లౌకికవాది అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఏ పార్టీలు అధికారంలో ఉన్నా రామోజీరావు నిత్యం ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షంగా వ్యవహరించారని చెప్పారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, ఎంపీలు మల్లు రవి, రేణుకా చౌదరి, పద్దిరాజు రవిచంద్ర, టీపీసీసీ నేతలు జగ్గారెడ్డి, మహే్‌షకుమార్‌ గౌడ్‌, మధుయాష్కీగౌడ్‌ సంతాపం తెలియజేశారు. కాగా, రామోజీరావు నిజమైన లెజెండ్‌ అని, ఆయన మరణ వార్త బాధ కలిగించిందని గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


మాజీ సీఎం కేసీఆర్‌ సంతాపం..

రామోజీరావు మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకునిగా రామోజీరావు అందించిన సేవలను స్మరించుకున్నారు. రామోజీరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - Jun 09 , 2024 | 03:32 AM