Share News

Hyderabad: త్వరలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు?

ABN , Publish Date - May 16 , 2024 | 02:59 AM

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం.. త్వరలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేయనుందా? ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టిందా? జూన్‌ 4న ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఏ క్షణాన్నైనా బదిలీ ఉత్తర్వులను విడుదల చేయనుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు, పరిపాలనలో ప్రభుత్వ అవసరాలు ఔననే చెబుతున్నాయి. ఈ క్రమంలో కీలక శాఖలకు బాధ్యత వహిస్తున్న ఒకరిద్దరు అధికారులకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది.

Hyderabad: త్వరలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు?

  • కసరత్తు మొదలు పెట్టిన సర్కారు

  • కౌంటింగ్‌ ముగియగానే ఉత్తర్వులు

  • ఒకరిద్దరు కీలక

  • ఐఏఎస్‌లకు స్థానచలనం

  • జీఏడీకి పూర్తిస్థాయి అధికారి?

  • కొందరు కలెక్టర్లకూ తప్పని బదిలీ!

  • విజిలెన్స్‌ డీజీగా సీనియర్‌

  • ఐపీఎస్‌ను నియమించే చాన్స్‌

  • నెలాఖరున యాంటీ నార్కోటిక్‌

  • బ్యూరో డైరెక్టర్‌ రిటైర్మెంట్‌

  • పోలీసు కమిషనర్లు,

  • ఎస్పీల బదిలీలపైనా నజర్‌

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం.. త్వరలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేయనుందా? ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టిందా? జూన్‌ 4న ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఏ క్షణాన్నైనా బదిలీ ఉత్తర్వులను విడుదల చేయనుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు, పరిపాలనలో ప్రభుత్వ అవసరాలు ఔననే చెబుతున్నాయి. ఈ క్రమంలో కీలక శాఖలకు బాధ్యత వహిస్తున్న ఒకరిద్దరు అధికారులకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది. అంతేకాదు.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడం, వెయిటింగ్‌లో ఉన్న ఏఐఎ్‌సలకు పోస్టింగులు ఇవ్వడం, జిల్లాల్లో వ్యతిరేకత ఉన్న కొందరు కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో కొత్తవారిని నియమించడంపై సర్కారు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.


రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సల బదిలీలు జరిగాయి. గత సర్కారుతో సన్నిహితంగా మెలిగిన కొందరు అధికారులను అప్రాధాన్య పోస్టింగుల్లో నియమించింది. జనవరిలోనూ 26 మంది బ్యూరోక్రాట్లు బదిలీ అయ్యారు. మార్చిలోనూ బదిలీల పరంపర కొనసాగగా.. ఇటీవల లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఈసీ పలువురిని బదిలీ చేసింది. ఎన్నికలు ముగియడంతో పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టిపెట్టిన సర్కారు.. మళ్లీ బదిలీలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా బదిలీల వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చి, కౌంటింగ్‌ తర్వాత.. ఎన్నికల కోడ్‌ ముగియగానే బదిలీల ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఒకరిద్దరు అధికారులను బదిలీ చేయాలని రేవంత్‌ సర్కారు యోచించినా.. అప్పట్లో అది వీలుపడలేదని తెలిసింది. వచ్చేనెల జరగనున్న బదిలీల్లో ఇలాంటి వారికీ స్థానచలనం తప్పదని తెలుస్తోంది.


ఖాళీల భర్తీపై దృష్టి

సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ)కు ప్రస్తుతం పూర్తిస్థాయి ముఖ్య కార్యదర్శి లేరు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు జీఏడీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జీఏడీకి పూర్తిస్థాయి కార్యదర్శిగా అధికారిని నియమించడంపై సర్కారు దృష్టి సారించినట్లు తెలిసింది. గవర్నర్‌ కార్యదర్శిగా ఉన్న సురేంద్రమోహన్‌ను మార్చిలో బదిలీ చేసినా.. ఇప్పటి వరకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి చాహత్‌ బాజపేయిలాంటి వారు వెయిటింగ్‌లో ఉన్నారు. ఇలా వెయిటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగులు ఇచ్చే అవకాశాలున్నాయి. వివాదాస్పదంగా మారిన ఒకరిద్దరు అధికారుల బదిలీ తప్పదనే చర్చ కూడా సాగుతోంది. రెండు ప్రభుత్వ శాఖల మధ్య వివాదానికి కారణమైన ఓ అధికారిణిని కూడా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకట్రెండు జిల్లాల కలెక్టర్లను మార్చాలంటూ స్థానికంగా వస్తున్న విజ్ఞప్తులను రేవంత్‌ సర్కారు పరిగణనలోకి తీసుకుని, వారిని మార్చే అవకాశాలున్నట్లు సమాచారం.


ఐపీఎస్‌ అధికారులకూ స్థానభ్రంశం

పోలీసు శాఖలోనూ ఎస్పీ స్థాయి మొదలు సీనయిర్‌ ఐపీఎ్‌సల బదిలీలకు సర్కారు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, మిషన్‌ భగీరథలో అక్రమాలపై ప్రభుత్వం విచారణ బాధ్యతలను విజిలెన్స్‌కు అప్పగించిన విషయం తెలిసిందే..! అయితే.. విజిలెన్స్‌ డీజీగా ఉన్న రాజీవ్‌రతన్‌ గత నెల ఆకస్మికంగా మృతిచెందారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో రేవంత్‌ సర్కారు ఇప్పటికే డీజీపీతో చర్చించినట్లు తెలిసింది. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని సర్కారు కంకణబద్ధమైన విషయం తెలిసిందే..! తెలంగాణ యాంటి నార్కొటిక్‌ బ్యూరో డైరెక్టర్‌గా కొనసాగుతున్న సందీప్‌ శాండిల్య ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. దాంతో ఖాళీ అయ్యే ఆ స్థానాన్ని కూడా భర్తీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తొమ్మిది పోలీసు కమిషనరేట్లలో ఒకరిద్దరు కమిషనర్లకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది. ఎస్పీ స్థాయి మొదలు సీనియర్‌ ఐపీఎ్‌సలలో కొందరిని బదిలీ చేసే అవకాశాలున్నాయి. ఇక సీనియర్‌ ఐపీఎ్‌సలలో కొందరి వద్ద అదనపు బాధ్యతలు ఉన్నాయి. రెండు, అంతకంటే ఎక్కువ విభాగాల బాధ్యతలను నెరవేరుస్తున్న వారిపైనా పనిభారాన్ని తగ్గించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - May 16 , 2024 | 05:39 AM