CM Revanth Reddy: అనుమతులు నిధులు ఇవ్వండి
ABN , Publish Date - Dec 13 , 2024 | 03:24 AM
దేశ రాజధానిలో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం బిజీబిజీగా గడిపారు. మధ్యాహ్నం జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన.. సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులు గడ్కరీ, కిషన్‌రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు.
హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించండి
ఆర్‌ఆర్‌ఆర్‌కు సాంకేతిక, ఆర్థిక అనుమతులివ్వండి
హైదరాబాద్-విజయవాడ రోడ్డును విస్తరించండి
రూ.1.63 లక్షల కోట్ల ప్రాజెక్టులకు సహకరించండి
సింగరేణికి బొగ్గు గనులు రాష్ట్రానికి కేవీలు ఇవ్వండి
కేంద్ర మంత్రులు గడ్కరీ, కిషన్‌రెడ్డి, ధర్మేంద్రకు
సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి నేడు
అధిష్ఠానంతో భేటీ మంత్రివర్గ విస్తరణపై చర్చ!
న్యూఢిల్లీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధానిలో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం బిజీబిజీగా గడిపారు. మధ్యాహ్నం జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన.. సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులు గడ్కరీ, కిషన్‌రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి వివరించి, నిధులు, అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి (159 కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థిక అనుమతులు వెంటనే ఇవ్వాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2017లోనే ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగాన్ని 161ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని గుర్తుచేశారు. ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందన్నారు. ఇక దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలాన్ని హైదరాబాద్‌తో అనుసంధానించే ఎన్‌హెచ్-765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉందని, మిగిలిన 62 కిలోమీటర్లు అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉందని వివరించారు. అటవీ, పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందని, కేవలం పగటి పూట మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోందని తెలిపారు. అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్-విజయవాడ (ఎన్‌హెచ్-65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయాలన్నారు. తెలంగాణలోని రెండో పెద్ద నగరమైన వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలన్నారు. తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ను అనుసంధానించే ఎన్‌హెచ్-63 (16) రహదారి వరంగల్, హన్మకొండ నగరాల మధ్యగా వెళుతోందని, దాన్ని నగరం వెలుపలి నుంచి మంజూరు చేయాలని కోరారు. పర్వత్‌మాల ప్రాజెక్ట్‌లో యాదాద్రి ఆలయం, నల్లగొండలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వేలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లాలో ఎన్‌హెచ్-65 పక్కన 67 ఎకరాల్లో ట్రాన్స్‌పోర్ట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు.
అభివృద్ధి పనులకు సహకరించండి..
తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆర్‌ఆర్‌ఆర్, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2తోపాటు హైదరాబాద్, వరంగల్‌లో సీవరేజీ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. మొత్తం రూ.1.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి కావాల్సిన చేయూతపై చర్చించారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, త్రైపాక్షిక ఒప్పందం పూర్తయినా ఇప్పటికీ ఎన్‌హెచ్‌ఏఐ అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలు, పారిశ్రామిక హబ్‌లు, లాజిస్టిక్, రిక్రియేషన్ పార్కులు వంటివి అభివృద్ధి చెందుతాయని వివరించారు. మెట్రో రెండో దశలో రూ.24,269 కోట్ల వ్యయంతో కొత్తగా 76.4 కి.మీ. రైలు మార్గం నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 వాటాతో మెట్రో రెండో దశను చేపట్టేందుకు సహకరించాలని కోరారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఇప్పటికే కోరిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంతోపాటు సమీప 27 మునిసిపాలిటీల్లో 7,444 కి.మీ. మేర సీవరేజీ నెట్‌వర్క్ పనులకు రూ.17,212.69 కోట్లతో సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ రూపొందించామని, అమృత్ 2 లేదా ప్రత్యేక ప్రాజెక్టు కింద దానిని చేపట్టేందుకు సహకరించాలని కోరారు. సింగరేణి సంస్థ మనుగడ కొనసాగించేందుకు గోదావరి లోయ పరిధిలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. సెమీకండక్టర్ల ప్రాజెక్టులకు హైదరాబాద్ అనువుగా ఉందని, తెలంగాణను సెమీకండక్టర్ మిషన్‌లో చేర్చాలని కోరారు. ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విడుదలలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని విన్నవించారు. తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వంనుంచి ఎన్‌వోసీ తీసుకునేలా చూడాలన్నారు.
నేడు కాంగ్రెస్ అగ్రనేతలతో రేవంత్ భేటీ!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం భేటీ కానున్నట్లు సమాచారం. రాహుల్‌తోపాటు ఇతర నేతలను కూడా కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణతోపాటు కుల గణన, రాష్ట్రంలో ఏడాది పాలన తదితర అంశాలపై రాహుల్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చర్చలు ఫలప్రదమైతే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశంఉంది.
మంత్రివర్గంపై అధిష్ఠానానిదే తుది నిర్ణయం: భట్టి
మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఢిల్లీలో ఉన్న భట్టి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణలో ప్రజా పాలన పట్ల 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. వందశాతం మంది ప్రభుత్వ పాలన పట్ల సంతోషంగా ఉంటారనుకోవడం లేదని చెప్పారు. హైడ్రాకు ధనిక, పేద అనే వ్యత్యాసాలేమీ లేవని చెప్పారు. రైతు భరోసాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి నుంచి అమలు చేస్తామన్నారు. తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేదని, టీఆర్‌ఎస్ పార్టీ తరఫున మాత్రమే ఉండేదని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారికంగా తెలంగాణ తల్లి ఉందన్నారు. కాగా, మంత్రివర్గ విస్తరణలో ప్రేమ్‌సాగర్ రావు పేరును కూడా పరిశీలించాలని భట్టి పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు తెలిసింది.