Share News

CM Revanth Reddy: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ

ABN , Publish Date - Oct 29 , 2024 | 04:48 AM

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని సీఎం హామీ ఇచ్చారని, ఆర్థిక అంశాలు కాకుండా మిగిలిన సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామన్నారని టీఎన్‌జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌ తెలిపారు.

CM Revanth Reddy: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ

  • అన్ని జిల్లాల్లో జేఏసీ కమిటీలు

  • టీఎన్‌జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌

సంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని సీఎం హామీ ఇచ్చారని, ఆర్థిక అంశాలు కాకుండా మిగిలిన సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామన్నారని టీఎన్‌జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌ తెలిపారు. సంగారెడ్డిలోని టీఎన్‌జీవోస్‌ భవన్‌లో జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల 206 ఉద్యోగ సంఘాలను కలిపి జేఏసీగా ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగుల పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రకటించిన క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పిలిచి సుమారు మూడు గంటలపాటు చర్చలు జరిపారన్నారు.


రెండు, మూడు వారాల్లో పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేస్తామని.. ఉద్యోగులు సంయమనం పాటించాలని సీఎం చెప్పినట్లు ఆయన వివరించారు. ఈ-కుబేర్‌ను రద్దు చేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ దీపావళికి ఒక డీఏ ఇస్తామని, మిగతా రెండు డీఏలు మార్చిలో ఇస్తామన్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లో జేఏసీ కమిటీలు ఏర్పాటు చేసి ఉద్యోగులను ఏకం చేస్తామన్నారు. రెవెన్యూలోని వీఆర్‌వోలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారని, దీంతో 5 వేల పోస్టులు ఖాళీ అయ్యాయని, ఫలితంగా కారుణ్య నియామకాలు కూడా ఆగాయనే విషయం సీఎంకు వివరించామని వాటన్నిటికి త్వరలో పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నామన్నారు.


ఉద్యోగులందరూ సక్రమంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఉద్యోగులకు ఏ పార్టీతో సంబంధం లేదని, రాజకీయాలు అవసరం లేదని స్పష్టం చేశారు. 317 జీవోపై గతంలో జిల్లాలు, జోన్‌ల విభజనలో అభ్యంతరాలు తెలిపినా గత సర్కారు పెడచెవిన పెట్టడంతో ప్రస్తుతం ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. టీఎన్‌జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్‌ మాట్లాడారు.

Updated Date - Oct 29 , 2024 | 04:48 AM