CM Revanth Reddy: గచ్చిబౌలిలోనే స్పోర్ట్స్ వర్సిటీ
ABN , Publish Date - Oct 05 , 2024 | 03:08 AM
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలోనే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
పీపీపీ విధానంలో ప్రత్యేక బోర్డుతో నిర్వహణ
అన్ని స్టేడియాలు, మైదానాలు యూనివర్సిటీ పరిధిలోకే
క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ, ప్రోత్సాహకాలు
జాతీయ, అంతర్జాతీయ విధానాల అధ్యయనంతో కొత్త విధానం
ముసాయిదా విధానంపై చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనలు
రేపు ఢిల్లీకి సీఎం.. 2రోజులు అక్కడే ఉగ్రవాద నియంత్రణపై కేంద్రం
నిర్వహించే సదస్సుకు హాజరు అధిష్ఠానం పెద్దలనూ కలిసే చాన్స్
హైదరాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలోనే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గచ్చిబౌలి స్టేడియం ప్రాంగణం 70 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, వివిధ క్రీడలకు సంబంధించి సదుపాయాలన్నీ ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో.. కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై చర్చించేందుకు అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా విశ్వవిద్యాలయాన్ని ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ‘గా వ్యవహరించాలని సూచించారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ మోడల్‌లో నిర్వహించాలని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని, యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండేలా చూడాలని అన్నారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త స్పోర్ట్స్ పాలసీ ఉండాలని సీఎం అన్నారు. 2036 ఒలింపిక్ క్రీడలను దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దే రీతిలో లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు. హై దరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న అన్ని స్టేడియాలు, క్రీడా మైదానాలను స్పోర్ట్స్ వర్సిటీ పరిధిలోకే తీసుకురావాలన్నారు. ఎల్బీ ేస్టడియం, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ ేస్డడియం, సరూర్‌నగర్ ఇండోర్ ేస్టడియం, ఓయూ యూనివర్సిటీ సైక్లింగ్ వెలోడ్రమ్‌లను ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని చెప్పారు.
అత్యుత్తమ విధానాలతో క్రీడా పాలసీ..
వివిధ క్రీడల్లో ప్రతిభ ఉన్న యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అధికారులు ఈ లక్ష్యానికి అనుగుణంగా అత్యుత్తమ విధానాలను క్రీడా పాలసీలో పొందుపరచాలని ఆదేశించారు. క్రీడాకారుల రెగ్యులర్ చదువులకు ఆటంకం కలగకుండా ఉండాలన్నారు. మన ప్రాంత భౌగోళిక పరిస్థితులకు అనుగుణమైన క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అంతర్జాతీయ స్థాయి కోచ్‌లను రప్పించి శిక్షణ అందజేయాలని సూచించారు. విదేశీ స్పోర్ట్స్ యూనివర్సిటీల సహకారం పొందేలా ఎంవోయూలు చేసుకోవాలన్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలను అధ్యయనం చేసి, రాష్ట్రంలో అనుసరించాల్సిన విధానాన్ని పాలసీలో పొందుపరచాలని ఆదేశించారు. ప్రోత్సాహకాలతో పాటు వాళ్లకు ఇచ్చే ఉద్యోగాల విషయంలో కూడా స్పష్టత ఉండాలన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలో 13 కోర్సులు ప్రారంభించాలని సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ లాంటి 14 క్రీడలను స్పోర్ట్స్ హబ్‌లో పొందుపరిచారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పేదల హృదయాల్లో దీపం కాకా
జి.వెంకటస్వామికి సీఎం రేవంత్ నివాళి
సీఎం సహాయ నిధికి పలువురి విరాళం
కాకా అని పిలుచుకునే జి.వెంకటస్వామి పేద ప్రజల హృదయాల్లో దీపమై వెలిగారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా కాకా.. పేదల కోసం పని చేశారన్నారు. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాల్లోనూ కాకా అలుపెరగని పోరాటం చేశారని, 1969లో కోసం జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఆయన నిలువ నీడలేని నిరుపేదలకు గూడు కల్పించాలని గుడిసెల పోరాటం చేసి కొన్ని వేల గుడిసెలు వేయించారని అన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి సహాయ నిధికి శుక్రవారం పలువురు విరాళాలు అందజేశారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు వి.సురేందర్‌రెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి.. ముఖ్యమంత్రిని కలిసి రూ.1,01,75,000 చెక్కు అందజేశారు. వీరితోపాటు విన్స్ బయో ఉత్పత్తుల సీఈవో, ఎండీ సిద్ధార్థ డాగ, ఎస్.ఎన్ డాగ రూ.51 లక్షల చెక్కును, బొండాడ గ్రూప్ సీఎండీ బొండాడ రాఘవేంద్రరావు తమ సంస్థ తరఫున రూ.25 లక్షలు, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఎండీ కె.రామ్మోహన్‌రావు 25 లక్షలు, సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ఎండీ కేవీ సుబయ్య, డైరెక్టర్ సోమలింగం గౌడ్ 10 లక్షలు విరాళంగా అందించారు. కాగా, జీ మీడియా గ్రూపు సంస్థల చైర్మన్ సుభా్‌షచంద్ర సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు.
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్
సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉగ్రవాద నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళుతున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోనే రెండు రోజులపాటు సీఎం మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులనూ ఆయన కలవనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టానికిగాను కేంద్ర ప్రభుత్వాన్ని అదనపు సాయం కోరడంతోపాటు వివిధ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని కోరనున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కూడా సీఎం కలుస్తారని, మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, హైడ్రా కార్యకలాపాలు, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం తదితర అంశాలపై వారితో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.