AI: ఏఐ విప్లవానికి హైదరాబాద్ రెడీ!
ABN , Publish Date - Sep 06 , 2024 | 03:41 AM
రాష్ట్రంలో కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భవిష్యత్తుకు బలమైన పునాది వేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
కృత్రిమ మేధ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ.. ఈ రంగంలో బలమైన పునాది వేస్తాం
పరిశ్రమలకు హైదరాబాద్ దేశంలోనే ఉత్తమం.. ఈనాటి అత్యుత్తమ ఆవిష్కరణ ఏఐనే
ప్రపంచ ఏఐ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భవిష్యత్తుకు బలమైన పునాది వేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే అందుకు అవసరమైన చాలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఏఐపై తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో కృత్రిమ మేధపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో గురువారం తొలిరోజు ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏఐకి సంబంధించి 25 అంశాలతో రూపొందించిన రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ తరహాలో మరే నగరమూ సిద్ధంగా లేదన్నారు. పరిశ్రమల ఏర్పాటులో ఉన్న సవాళ్లను స్వీకరించడమే కాకుండా ఆయా రంగాలకు భవిష్యత్తును సృష్టిస్తామని చెప్పారు. నాస్కామ్ భాగస్వామ్యంతో చేపడుతున్న తెలంగాణ ఏఐ మిషన్(టీ-ఏఐఎం) ద్వారా రాష్ట్రంలో కృత్రిమ మేధఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేస్తామన్నారు. కృత్రిమ మేధరంగంలోని నిపుణులతో కలిసి ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ను కృత్రిమ మేఽధ కేంద్రంగా తీర్చదిద్దబోతున్నామనేందుకు ఈ సదస్సే నిదర్శనమని చెప్పారు. ముచ్చర్లలో నిర్మించబోయే భవిష్య నగరాన్ని గొప్ప ఏఐ హబ్‌గా తీర్చిదిద్దే సంకల్పంలో అందరూ భాగస్వాములు కావాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
భవిష్య నగరం అందరికీ స్వాగతం పలుకుతోందన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చినపుడల్లా కొంత భయం నెలకొనడం సహజమేనని, అది మన జీవితాన్ని మెరుగు పరుస్తుందా? లేక ఉద్యోగాలు పోతాయా? అనే భయాలు తలెత్తుతాయని చెప్పారు. కృత్రిమ మేధ ప్రపంచ సాంకేతిక రంగంలో ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణ అన్నారు. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని భారతదేశం అందిపుచ్చుకోలేక పోయిందని, కొత్తగా వచ్చిన ఏఐ విప్లవాన్ని అయినా అందుకోవడానికి దేశం సిద్ధంగా ఉంటే అందుకు నాయకత్వం వహించడానికి హైదరాబాద్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ సదస్సుతో ఏఐ ఆవిష్కరణల్లో సరికొత్త ప్రమాణాలను సృష్టించేందుకు హైదరాబాద్ తన సన్నద్ధతను ప్రకటించిందని చెప్పారు.
టెలివిజన్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్‌లను చూడడం మనతరం చేసుకున్న అదృష్టమని వ్యాఖ్యానించారు. కరెంటు బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ ఇవన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలకపాత్ర పోషించాయని చెప్పారు. రైలు ఇంజిన్, విమానం ఆవిష్కరణలతో ప్రపంచ స్వరూపమే మారిపోయిందన్నారు. సాంకేతిక, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదని చెప్పారు. ఏఐ సదస్సులో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను రేవంత్‌రెడ్డి సందర్శించారు. సదస్సులో పాల్గొనడానికి వచ్చిన యొట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌పి సీఈవో సునీల్‌గుప్తా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు.
హైదరాబాద్‌లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంపై చర్చించారు. ఐబిఎం వైస్ ప్రెసిడెంట్ డానియల్ కాంబ్, జె-పిఏయల్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఇక్బాల్‌సింగ్ దలివాల్ కూడా రేవంత్‌తో భేటీ అయ్యారు. కృత్రిమ మేధలో భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలు, ఏఐ రంగం అభివృద్ధిపై చర్చించారు. అందరికోసం కృత్రిమ మేధ అంశంపై అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి. వివిధ దేశాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.