Ashwini Vaishnaw: వెనకబడిన జిల్లాల గ్రాంట్ 1800 కోట్లు ఇవ్వండి
ABN , Publish Date - Dec 14 , 2024 | 03:56 AM
తెలంగాణకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన రైల్వే ప్రాజెక్టులనూ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణకు ఆర్థిక చేయూతనివ్వండి
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని త్వరగా పూర్తి చేయండి
కేంద్ర మంత్రులు నిర్మల, వైష్ణవ్‌కు సీఎం వినతి
ఉమ్మడి సంస్థల నిర్వహణ వ్యయం రూ.408 కోట్లు ఇప్పించండి
న్యూఢిల్లీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన రైల్వే ప్రాజెక్టులనూ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి.. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని వెనకబడిన జిల్లాలకు ఇచ్చే గ్రాంట్ రూ.1800 కోట్లు పెండింగ్‌లో ఉందని, ఆ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని నిర్మలా సీతారామన్‌ను కోరారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లోని హైకోర్టు, రాజ్‌భవన్, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ తదితతర ఉమ్మడి సంస్థల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.703.43 కోట్లు భరించిందని, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.408.49 కోట్లను చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఆ డబ్బు చెల్లింపునకు ఏపీ సమ్మతించినా.. నేటికీ ఇవ్వలేదని, ఆ నిధులను వడ్డీతో సహా చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రుణాల పంపిణీలో తెలంగాణ నుంచి రూ.2,547.07 కోట్ల రికవరీకి కేంద్రం ఏకపక్షంగా ఆదేశాలిచ్చిందని రేవంత్ తెలిపారు. దీనిపై పునఃసమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను 2014-15లో కేంద్రం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించిందని తెలిపారు. పునర్విభజన చట్టంలోని జనాభా ప్రాతిపదికన ఆ మొత్తంలో ఏపీ నుంచి తెలంగాణకు రూ.495.20 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉందన్నారు. వాటిని ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని త్వరగా పూర్తి చేయండి
కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని త్వరగా పూర్తిచేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను సీఎం రేవంత్ కోరారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం స్వయంగా తాను లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. వికారాబాద్-కృష్ణా స్టేషన్ మధ్య పూర్తిగా రైల్వే శాఖ వ్యయంతో నూతన రైలు మార్గం నిర్మించాలని కోరారు. దీనివల్ల దక్షిణ తెలంగాణలో వెనకబడిన ప్రాంతాలైన పరిగి, కొడంగల్, చిట్లపల్లె, టేకల్ కోడ్, రావులపల్లి, మాటూరు, దౌల్తాబాద్, దామరగిద్ద, నారాయణపేట్, మక్తల్ అభివృద్ధి చెందుతాయని చెప్పారు. కల్వకుర్తి-మాచర్ల మధ్య నూతన రైలు మార్గం నిర్మిస్తే సిమెంట్ పరిశ్రమలతోపాటు అటవీ ఉత్పత్తుల విక్రయానికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ మార్గంతో సికింద్రాబాద్, గుంటూరు, డోన్‌ను అనుసంధానం చేయవచ్చని, తద్వారా శ్రీశైలం వెళ్లే భక్తుల ప్రయాణం సులభతరం అవుతుందని చెప్పారు. డోర్నకల్-మిర్యాలగూడ, డోర్నకల్-గద్వాల ప్రతిపాదిత రైలు మార్గాలను పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు రైలు మార్గాల్లో భూముల సేకరణ రైల్వే శాఖకు భారంగా మారుతుందని, ఆ మార్గాలను మార్చి డోర్నకల్ నుంచి వెన్నారం-మన్నెగూడెం-అబ్బాయిపాలెం-మరిపెడ మీదుగా మోతె వరకు వేస్తే.. 19 కి.మీ. దూరం కూడా తగ్గుతుందన్నారు.