Share News

CM Revanth Reddy: ఆరు కాదు.. 160!

ABN , Publish Date - Dec 07 , 2024 | 04:23 AM

ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక తొలి ఏడాదిలోనే మార్పు మొదలైందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మాత్రమే కాకుండా 160 అంశాల్లో ప్రజోపయోగ పనులు చేపట్టినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

CM Revanth Reddy: ఆరు కాదు.. 160!

  • గ్యారంటీలను మించి ప్రజోపయోగ పనులు.. నిత్యం సీఎం రేవంత్‌ సమీక్షలు, సమావేశాలు

  • సమగ్ర అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం

  • పదేళ్ల విధ్వంస ఆనవాళ్లను చెరిపివేశాం

  • ఏడాదిలోనే మార్పు.. సీఎంవో వెల్లడి

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక తొలి ఏడాదిలోనే మార్పు మొదలైందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మాత్రమే కాకుండా 160 అంశాల్లో ప్రజోపయోగ పనులు చేపట్టినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రజలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుందని, సుస్థిర ప్రజాస్వామిక పాలనతో దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలిపిందని పేర్కొంది. అధికారం చేపట్టినప్పటి తొలిరోజు నుంచే సీఎం రేవంత్‌ రెడ్డి అన్ని రంగాల్లో తెలంగాణ సమ్మిళిత అభివృద్థికి నిరంతరం సమీక్షలు... సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొంది. ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు గత ఏడాది డిసెంబరు నుంచి ప్రభుత్వం చేపట్టిన 160 ప్రజోపయోగ పనుల్లో ముఖ్యమైన వాటిని సీఎంవో వెల్లడించింది. పదేళ్ల విధ్వంసపు ఆనవాళ్లను చెరిపేసి తెలంగాణ పునర్‌ వైభవాన్ని కొనసాగిస్తూనే.. సమగ్ర అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడించింది. తెలంగాణను ఫ్యూచర్‌ స్టేట్‌గా, హైదరాబాద్‌ను ఫ్యూచర్‌ సిటీగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు సీఎం రేవంత్‌ చేసిన ప్రయత్నాలు..తొలి ఏడాదిలోనే సత్ఫలితాలు ఇచ్చినట్లు వివరించింది. ‘‘తొలి ఏడాదే 55,143 ఉద్యోగాల భర్తీతోలక్షలాది మంది నిరుద్యోగుల ఆకాంక్షలను ప్రజాప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఫలితంగా తెలంగాణలో నిరుద్యోగ శాతం తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలచింది. 67లక్షల ఎకరాల్లో వరి సాగు చేేస్త.. 153 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. 25లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు ఏకకాలంలో పంట రుణాలు మాఫీ చేశాం. ఐదేళ్లలో 30లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చేలా పనులు ప్రారంభించాం’’ అని పేర్కొంది.


  • పేదల సంక్షేమం కోసం

మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సగటున 30లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వారికి రూ.1500 కోట్ల ఆదా చేయగలిగామని సీఎంవో వెల్లడించింది. మహిళలకు వడ్డీలేని రుణాల పునరుద్ధరణ. రుణ బీమాతోపాటు సంఘం సభ్యురాలికి రూ.10లక్షల ప్రమాద బీమా అమలు చేస్తున్నట్లు తెలిపింది. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకంతో 40లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందని పేర్కొంది. ‘‘గృహజ్యోతి పథకం కింద అరకోటి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నట్లు తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి ఏడాదిలోనే 4.50లక్షల ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్‌ యాప్‌ను ప్రారంభించాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకంలో ఉచిత వైద్యం పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాం. కొత్త ఆర్వోఆర్‌ ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణను ఇప్పటికే పూర్తి చేశాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించి... కొత్త చట్టం తీసుకొస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణకు జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేశాం. మహిళాశక్తి సంఘాల ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాం. గతంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లలో అవకతవకలపై విచారణకు జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేశాం. ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించడంతోపాటు ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ఈహెచ్‌ఎస్‌ పథకంలో మార్పులు చేశాం. ఆర్టీసీ ఉద్యోగులకు 21శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడంతోపాటు 557కారుణ్య నియామకాలు చేపట్టాం’’ అని వెల్లడించింది.


  • విద్య, వైద్య రంగాల్లో..

రాష్ట్రంలో కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 17నర్సింగ్‌, 28 పారా మెడికల్‌ కళాశాలల ఏర్పాటు చేసినట్లు సీఎంవో తెలిపింది. ‘‘రూ.2వేల కోట్లతో గోషామహల్‌ స్టేడియుయంలో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనానికి శంకుస్థాపన చేశాం. ఆరోగ్య శాఖలో 7 వేలకు పైగా పోస్టులను ఇప్పటికే భర్తీ చేయగా.. కొత్తగా 9300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.667.25కోట్లు కేటాయించగా, అమ్మ ఆదర్శ కమిటీల సారథ్యంలో పనులు కొనసాగుతున్నాయి. హాస్టళ్లలోని 7.65 లక్షల మంది విద్యార్థులకు డైట్‌ చార్జీలను 40 శాతం పెంచాం. అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్‌ గురుకులాల ఏర్పాటుపై దృష్టి పెట్టాం’’ అని వివరించింది.


  • వివిధ రంగాల్లో అభివృద్ధి పనులు

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10కోట్ల దాకా ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించినట్లు సీఎంవో తెలిపింది. గ్రామీణ తాగునీటి సరఫరా విభాగానికి రూ.3,046 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పింది. ‘‘హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రాను ఏర్పాటు చేశాం. గోదావరి జలాలతో మూసీ పునరుజ్జీవం దిశగా అడుగులు వేస్తున్నాం. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. రూ.24,237 కోట్లతో 76.4కిలోమీటర్ల మేర మెట్రో రైలు విస్తరణ చేపట్టాలని నిర్ణయించాం. హైకోర్టు నూతన భవనానికి బుద్వేల్‌లో 100ఎకరాల స్థలం కేటాయించాం. రీజనల్‌ రింగ్‌ రోడ్డునుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాం. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం. హైదరాబాద్‌ శివారులోని కందుకూరు మండలం మీర్ఖాన్‌పేటలో యంగ్‌ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ నిర్మాణాన్ని ఇటీవలే ప్రారంభించాం. దావో్‌సలో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సు సందర్భంగా రాష్ట్రంలో రూ.40,232కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు అంగీకరించాయి. తద్వారా 30వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికా, దక్షిణకొరియాలో పర్యటించగా.. దాదాపు రూ.31502 కోట్ల మేర పెట్టుబడులు పెడతామంటూ పలు సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి’’ అని సీఎంవో పేర్కొంది. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని ముదిరాజ్‌, యాదవ కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్‌, మేరా, గంగపుత్ర కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించింది.

Updated Date - Dec 07 , 2024 | 04:23 AM