Sangareddy: సిర్పూర్(యు)లో 9.9 డిగ్రీలు
ABN , Publish Date - Nov 23 , 2024 | 04:05 AM
రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇటీవలే సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో ఈ చలికాలంలో తొలిసారి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయిన విషయం తెలిసిందే.
కొనసాగుతున్న చలి తీవ్రత
గ్రేటర్ గజగజ... పటాన్‌చెరులో 12.6 డిగ్రీలు
సిర్పూర్(యు), రంగారెడ్డి, హైదరాబాద్ సిటీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇటీవలే సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో ఈ చలికాలంలో తొలిసారి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కూడా ఆ జాబితాలో చేరింది. గురువారం రాత్రి జిల్లాలోని సిర్పూర్(యు)లో అత్యల్పంగా 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ మండలాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. వికారాబాద్ జిల్లా నవాబుపేటలో 11.3 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో 11.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.
మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 12-14 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మరోవైపు గ్రేటర్ పరిధిలో చలి ప్రభావం ఎక్కువవుతుండటంతో నగరవాసులు గజగజలాడిపోతున్నారు. శుక్రవారం పటాన్‌చెరులో అత్యల్పంగా 12.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవ్వగా రాజేంద్రనగర్‌లో 13.5 డిగ్రీల సెల్సియ్‌సగా ఉంది. మరో నాలుగు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.