Share News

Mahesh Kumar Goud: కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:01 AM

‘కాంగ్రెస్‌ కార్యకర్తలు అధైర్యపడొద్దు.. రాబోయే రోజులు మీవే.. అందరికీ పదవులు వస్తాయి.. కొంత ఓపిక పట్టండి.. సీఎం రేవంత్‌రెడ్డి నేను, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అధికారం రావడానికి కష్టపడ్డాం. కార్యకర్తల కోసం పని చేస్తాం.

Mahesh Kumar Goud: కార్యకర్తలందరికీ  న్యాయం చేస్తాం

  • పని చేస్తే గుర్తింపు.. దానికి నేనే ఉదాహరణ

  • మరో పదేళ్లు అధికారంలో ఉండేది కాంగ్రెస్సే

  • రాజకీయాల్లోకి నన్ను తీసుకొచ్చింది డీఎస్సే

  • ఎప్పటికీ ఆయనను గురువుగానే భావిస్తాను

  • రేవంత్‌ ఆధ్వర్యంలో హామీలన్నీ నెరవేరుస్తాం

  • టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

  • నిజామాబాద్‌లో సన్మానం.. బహిరంగ సభ

నిజామాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ‘కాంగ్రెస్‌ కార్యకర్తలు అధైర్యపడొద్దు.. రాబోయే రోజులు మీవే.. అందరికీ పదవులు వస్తాయి.. కొంత ఓపిక పట్టండి.. సీఎం రేవంత్‌రెడ్డి నేను, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అధికారం రావడానికి కష్టపడ్డాం. కార్యకర్తల కోసం పని చేస్తాం. అందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తాం’.. అని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ అన్నారు. నిజామాబాద్‌లోని పాత కలెక్టరేట్‌ మైదానంలో శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఎన్నో ఏళ్లు కార్యకర్తలు కష్టపడ్డారని గుర్తు చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారందరినీ గెలిపించే బాధ్యత పార్టీతోపాటు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు తీసుకుంటారని తెలిపారు. పనిచేసే కార్యకర్తలకు, నేతలకు ఏదో విధంగా పదవులు దక్కేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గడపగడపకూ తీసుకెళ్లాలని, స్థానిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కష్టపడాలని సూచించారు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉండేలా అందరం కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీని దేశ ప్రధానిని చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్‌ పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందనడానికి తానే ఉదాహరణ అని చెప్పారు.


ఒకప్పుడు కరాటే మాస్టర్‌గా పని చేసుకుంటున్న తనను.. డి.శ్రీనివాస్‌ తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. తన రాజకీయ జీవితంలో పలు దఫాలు డీఎ్‌సను వ్యతిరేకించినా.. ఎప్పటికీ ఆయన్ను గురువుగానే భావిస్తానని తెలిపారు. తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. ఈ అవకాశం కల్పించిన అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. టీపీసీసీ అధ్యక్ష పదవికి తనతోపాటు మధుయాష్కీ, లక్ష్మణ్‌కుమార్‌ పోటీ పడ్డారని, తనకు పదవి దక్కాక వారు కూడా తనకు శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. మూడేళ్ల క్రితం రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా, తనను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించినప్పుడు సమన్వయంతో పని చేశానని, ఇప్పుడూ అదే తీరులో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.


సీఎం రేవంత్‌రెడ్డి టీమ్‌లో మంచి మంత్రులు ఉన్నారని, కష్టమైనా.. పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులను తిరిగి చెల్లిస్తూనే.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. పార్టీ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 61శాతం దక్కేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. దేవుళ్లు, మతాల పేరిట కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ రాజకీయాలు చేయలేదని మహేశ్‌గౌడ్‌ గుర్తు చేశారు. మతాలు, కులాల పేరిట ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా కేంద్రంలో బీజేపీ మూడో సారి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. పదేళ్లలో సామాన్య ప్రజల కోసం మోదీ ఏం చేశారని నిలదీశారు. పదేళ్లపాటు పాలించిన కేసీఆర్‌.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు.


  • పార్టీ కోసం పని చేసిన వ్యక్తి మహేశ్‌గౌడ్‌

సామాన్య కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకూ ఎదిగిన మహేశ్‌గౌడ్‌ జీవితాన్ని కార్యకర్తలు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సూచించారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి మహేశ్‌గౌడ్‌ అని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశామని, త్వరలోనే పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. దసరాలోపే ప్రతీ కుటుంబానికి డిజిటల్‌ ఫ్యామిలీ కార్డు అందిస్తామన్నారు. రేషన్‌తోపాటు అన్ని సంక్షేమ పథకాలకు ఈ కార్డు ఉపయోగపడుతుందన్నారు. క్రమశిక్షణతో పనిచేస్తే తగిన గుర్తింపుతో పాటు అవకాశాలు వస్తాయని, దానికి మహేశ్‌గౌడే ఉదాహరణ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.


స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌ జెండా ఎగిరే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రె్‌సలో కష్టపడ్డ వారికి అవకాశాలు వస్తాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. మహేశ్‌గౌడ్‌, పొన్నం ప్రభాకర్‌, తాను కలిసి ఎన్‌ఎ్‌సయూఐలో పని చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుర్తు చేశారు. ఏళ్ల తరబడి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ప్రజల పక్షాన పోరాడామన్నారు.


వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపించాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ పిలుపునిచ్చారు. పని చేసే కార్యకర్తలకు అవకాశాలు ఇస్తామని భరోసాఇచ్చారు. కాగా, నిజామాబాద్‌కు వచ్చిన మంత్రి తుమ్మల.. మార్గమధ్యలో డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)గ్రామంలోని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. మండవ కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశారు. కాగా, మహేశ్‌గౌడ్‌ నిజామాబాద్‌ వెళ్లడంతో గాంధీభవన్‌లో నిర్వహించే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం వాయిదా పడింది. ప్రజలు, కార్యకర్తలు సోమవారం గాంధీభవన్‌కు వచ్చి విజ్ఞప్తులు అందించాలని టీపీసీసీ సూచించింది.


రైతుల సంక్షేమమే లక్ష్యం: మదన్‌మోహన్‌ రావు

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌కు ఘన స్వాగతం

సదాశివనగర్‌/కామారెడ్డి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ రావు అన్నారు. ఇందులో భాగంగానే రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం మర్కల్‌లో శుక్రవారం సదాశివనగర్‌ నూతన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సంధ్య నాయక్‌, వైస్‌ చైర్మన్‌గా జక్కుల రాజిరెడ్డితోపాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.


ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన మార్కెట్‌ కమిటీ పాలకవర్గ సభ్యులు రైతుల పక్షాన పని చేయాలన్నారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ తొలిసారి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. కాగా, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ఎల్లారెడ్డి మునిసిపాలిటీని కాంగ్రెస్‌ కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు. బీఆర్‌ఎ్‌సకు చెందిన 8మంది కౌన్సిలర్లు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరగా.. మునిసిపాలిటీ కాంగ్రెస్‌ వశమైంది. మున్సిపల్‌ చైర్మన్‌గా పద్మ శ్రీకాంత్‌ ఎన్నికయ్యారు.

Updated Date - Oct 05 , 2024 | 04:01 AM