Congress: 50 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:51 AM
విద్యుత్తు రంగాన్ని గత ప్రభుత్వం పదేళ్లలో విధ్వంసం చేసిందని కాంగ్రెస్ సర్కారు పేర్కొంది. విద్యుత్తు సంస్థల పేరిట రూ.83వేల కోట్ల అప్పులు చేసి, ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన దుస్థితి నెలకొందని తెలిపింది.
200 యూనిట్లలోపు ఉచితంగా విద్యుత్తు
గత సర్కారు పదేళ్ల పాలనలో ‘విద్యుత్తు’ విధ్వంసం
ఏడాదిలో విద్యుత్తు సంస్థలు తలెత్తుకునేలా చేశాం
వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు రంగాన్ని గత ప్రభుత్వం పదేళ్లలో విధ్వంసం చేసిందని కాంగ్రెస్ సర్కారు పేర్కొంది. విద్యుత్తు సంస్థల పేరిట రూ.83వేల కోట్ల అప్పులు చేసి, ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన దుస్థితి నెలకొందని తెలిపింది. అంత దయనీయ స్థితిలో ఉన్న విద్యుత్తు సంస్థలను మళ్లీ తలెత్తుకునేలా.. ఏడాది కాలంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. రైతులు, పేద వర్గాలకు మేలు చేసే పథకాలు కొనసాగిస్తూనే విద్యుత్తు రంగాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించింది. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లలో దుబారాను అరికట్టినట్లు గుర్తుచేసింది. భవిష్యత్ విద్యుత్తు అవసరాల కోసం కొత్తగా పునరుత్పాదక ఇంధన వనరుల విధానం (గ్రీన్ ఎనర్జీ) రూపొందిస్తున్నట్లు పేర్కొంది. గత పదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని శ్వేతపత్రం రూపంలో విడుదల చేశామంది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణంలో, విద్యుత్తు కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 29 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు ప్రయోజనాలు అందించడానికి రూ.10,444 కోట్ల సబ్సిడీని ఇచ్చినట్లు ప్రకటించింది. గత పదేళ్లలో రూ.20 వేల కోట్ల మేర కరెంట్ చార్జీలను పెంచగా.. ఈ ఏడాది చార్జీలను సవరించకుండానే 1.85 కోట్ల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామని గుర్తు చేసింది.
ఆరు గ్యారెంటీల్లో భాగంగా ‘గృహజ్యోతి’ పథకాన్ని ప్రభుత్వం గత మార్చి నుంచి విజయవంతంగా అమలు చేయడంతో 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడే 50 లక్షల కుటుంబాలకు ఉచిత బిల్లులు జారీ చేస్తున్నామంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్తు అందించే మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని 39067 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తు కోసం రూ.101.57 కోట్లను విద్యుత్తు సంస్థలకు అందిస్తున్నట్లు వివరించింది. రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోందనడానికి విద్యుత్తు వినియోగమే నిదర్శనమంది. 2023 ఆగస్టులో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌లో 8వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈ ఏడాది ఐదో స్థానానికి చేరిందని గుర్తుచేసింది. 15,623 మెగావాట్ల అత్యధిక డిమాండ్‌తో సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు ప్రకటించింది. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి రద్దు కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పర్యావరణ అనుమంతి పొందినట్లు తెలిపింది. తొలి దశలో ప్లాంట్‌లోని రెండు యూనిట్ల పనులను పూర్తిచేసి, సెప్టెంబరు 12న గ్రిడ్‌లకు అనుసంధానం చేసినట్లు పేర్కొంది. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 800 మెగావాట్ల యూనిట్లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నామని గుర్తు చేసింది.
మహిళా సంఘాలకు 4వేల మెగావాట్ల సౌరశక్తి
దేశంలోనే వినూత్నంగా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సంఘం ఆధ్వర్యంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో మెగావాట్ ఉత్పత్తి అయ్యేలా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని ఐదు గ్రామాలను నూటికి నూరుశాతం సౌర విద్యుత్తు వినియోగించేలా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించింది. రెప్పపాటు కోత లేకుండా నిరంతరాయంగా విద్యుత్తు అందించేందుకు, ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే విద్యుత్తును పునరుద్ధరించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెహికల్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది.