Hyderabad: నాగచైతన్య, సమంత విడాకులు.. కేటీఆర్ వల్లే..
ABN , Publish Date - Oct 03 , 2024 | 04:33 AM
సినీ హీరో నాగచైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆరే వంద శాతం కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు కొందరు హీరోయిన్ల ఫోన్లనూ ట్యాప్ చేయించి.. బెదిరించారు
తాను డ్రగ్స్ వాడుతూ వారికీ అలవాటు చేశారు
మంత్రి కొండా సురేఖ విపరీత వ్యాఖ్యలు ఖండించిన నాగార్జున కుటుంబం, సమంత
తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోండి!
మా కుటుంబంపై మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం
మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు మా జీవితాల్ని వాడుకోవద్దు.. సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ట్వీట్
విడాకుల వెనుక రాజకీయ కుట్ర లేదు: సమంత ఒక మహిళా మంత్రి రాక్షసిలా మారి అసత్యాలు
ప్రచారం చేయడం సిగ్గుచేటు: నటి అమల
క్షమాపణ చెప్పకుంటే పరువునష్టం దావా కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు
హైదరాబాద్, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): సినీ హీరో నాగచైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆరే వంద శాతం కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచురించడానికి వీల్లేని స్థాయిలో ఆమె చేసిన మరిన్ని ఆరోపణలు.. తీవ్ర దుమారం రేపాయి. గాంధీభవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన సురేఖ.. పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌తో పడలేక ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు పెళ్లిళ్లు చేసేసుకున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కొంత మంది హీరోయిన్ల ఫోన్లనూ ట్యాప్ చేయించారని.. వారి మాటలను రికార్డ్ చేసి బెదిరించారని ఆరోపించారు. తాను డ్రగ్స్ వాడడమే కాక వారికి కూడా అలవాటు చేశారని అన్నారు.
మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది సినీ యాక్టర్ల జీవితాలతో ఆడుకుని, వారిని డ్రగ్స్ కేసులో ఇరికించిన కేటీఆర్.. తాను మాత్రం తప్పుకొన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసులను తమ ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుందన్నారు. అయితే, మంత్రి వ్యాఖ్యలను నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత ఖండించారు. అమల తీవ్రమైన పరుష పదజాలంతో సురేఖపై ట్విటర్‌లో విరుచుకుపడ్డారు. మరోవైపు.. మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలను తక్షణం వెనక్కి తీసుకోవాలని.. 24 గంటల్లోగా తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టప్రకారం ముందుకు వెళ్తానని.. పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. రాజకీయాల కోసమే ఆమె కక్షతో తన పేరును వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.
అబద్ధం.. అసంబద్ధం..
నాగచైతన్య, సమంత విడాకులుకు కేటీఆరే కారణమంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నటుడు అక్కినేని నాగార్జున మంత్రి కొండా సురేఖను ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు. ‘‘రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను.. మీ ప్రత్యర్థులను విమర్శించడానికి వాడుకోవద్దు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం’’ అని ఆవేదన వెలిబుచ్చారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని హితవు పలికారు. ఆయన భార్య అమల అక్కినేని.. కొండా సురేఖపై మరింత పరుష పదజాలంతో ‘ఎక్స్’లో విరుచుకుపడ్డారు.
ఒక మహిళా మంత్రి ఇలా రాక్షసిలా మారి.. ఎలాంటి ఆధారాలూ లేకుండా పాపిష్టి, కల్పిత, నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. పరువుగా బతికే పౌరులను.. మంత్రి తన రాజకీయ యుద్ధంలో బలిపశువులుగా వాడుకోవడం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని నిప్పులు చెరిగారు. రాజకీయ నాయకులే ఇంతగా దిగజారి, నేరగాళ్లలా ప్రవర్తిస్తే దేశం ఏమైపోతుందని ఆవేదన వెలిబుచ్చారు. ‘నా భర్త గురించి ఇలాంటి అసత్యాలను చెబుతున్నవారిని నమ్ముతున్నారా? ఇది సిగ్గుచేటు. మీ రాజకీయ లబ్ధి కోసం మా కుటుంబాన్ని వివాదాల్లోకి లాగొద్దు’ అని హెచ్చరించారు. అంతేకాదు.. ‘‘మిస్టర్ రాహుల్ గాంధీ, మీరు వ్యక్తుల గౌరవమర్యాదలకు విలువ ఇచ్చేవారైతే, దయచేసి మీ నాయకులను అదుపులో పెట్టండి. మీ మంత్రితో ఈ విషపూరిత వ్యాఖ్యలను వెనక్కితీసుకునేలా చేసి నా కుటుంబానికి క్షమాపణ చెప్పించండి. ఈ దేశ పౌరులను కాపాడండి’’ అని రాహుల్‌గాంధీని, ప్రియాంకగాంధీని ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
పరస్పర అంగీకారంతోనే మా విడాకులు..
తామిద్దరం పరస్పర అంగీకారంతోనే, సామరస్యపూర్వకంగా విడాకులు తీసుకున్నామని.. అది తమ వ్యక్తిగత వ్యవహారం తప్ప అందులో ఎలాంటి రాజకీయ కుట్రకూ తావు లేదని సమంత, నాగచైతన్య వేర్వేరు ప్రకటనల్లో స్పష్టం చేశారు. తమ విడాకులకు గల కారణాలను బయటపెట్టాలనుకోవడం లేదని, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని సమంత తన ఇన్‌స్టా ఖాతా వేదికగా వివరణ ఇచ్చారు. ‘మహిళలకు ఆసరా ఇవ్వని గ్లామర్ ప్రపంచంలో నెగ్గుకురావడం, ప్రేమలో పడడం, విఫల ప్రేమ నుంచి బయటపడడం, అయినా నిలబడి పోరాడడం.. అంత సులభం కాదు. మహిళగా జీవించేందుకు, సమాజంలో నిలబడి పోరాడేందుకు చాలా ధైర్యం కావాలి. నా జీవిత ప్రయాణం నన్ను ఆ విధంగా మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి దాన్నికించపరచవద్దు’ అని సురేఖను కోరారు. ‘దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా?’ అని ప్రశ్నించారు. ‘మంత్రిగా మీ మాటలకు సమాజంలో ఒక విలువ ఉంటుందని మీరు గ్రహించాలి.
ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా, హుందాగా ప్రవర్తించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇకపై నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం మానేయండి’ అని హితవు పలికారు. ఇక.. విడాకులనేవి అత్యంత బాధాకరమైన, దురదృష్టకరమైన నిర్ణయమని నాగచైతన్య ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. తాను, సమంత ఎంతో ఆలోచించిన తర్వాత.. విభిన్న జీవిత లక్ష్యాలను సాధించే క్రమంలో విడిపోవాలనే నిర్ణయానికి వచ్చామని వివరించారు. మంత్రి సురేఖ తమపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం, హాస్యాస్పదమే కాక ఆమోదయోగ్యం కూడా కావని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో పతాకశీర్షికల కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత నిర్ణయాలను వాడుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వెలిబుచ్చారు. ఇక.. ‘‘ఏమిటీ సిగ్గులేని రాజకీయాలు? సినిమా రంగంలో పనిచేసే ఆడవాళ్లంటే చిన్నచూపా?’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేశారు.
చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై చాలాకాలంగా గళమెత్తుతున్న గాయని, సమంత ఆప్తమిత్రురాలు చిన్మయి శ్రీపాద కూడా దీనిపై స్పందించారు. ‘‘దురదృష్టవశాత్తు.. కొన్ని యూట్యూబ్ చానళ్లు, మీడియా వ్యక్తులు.. డబ్బుల కోసం, ఫేమ్ కోసం సమంత పేరుతో కొన్ని వీడియోలు పెట్టడాన్ని చూశా. వారి మైలేజీ కోసం సమంత పేరుని ఇలా వాడుకోవడం బాధాకరం. నాకు అర్థమయ్యిందేంటంటే.. ప్రజాదారణ పొందాలంటే వీళ్లందరికీ సమంత పేరు కావాలి. మరో మార్గం లేదు. కానీ కలలో కూడా వారు ఆమె స్థాయిని అందుకోలేరు. సమంత ఎవ్వరికీ అందనంత స్థాయిలో ఉందనేది నిజం. వీరు చేసేదానికి తగిన ఖర్మ అనుభవించాలని కోరుకోవడానికి నవరాత్రికి మించిన సమయం లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు షాకింగ్‌గా ఉన్నాయని రచయిత కోన వెంకట్ అన్నారు. ‘‘ఆమె ప్రతీ మాటను నేను ఖండిస్తున్నాను. సీఎం రేవంత్ ఈ విషయంపై సీరియ్‌సగా దృష్టిసారించాలని కోరుతున్నాను. ఇటువంటి అవమానకరమైన, బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడినందుకు మంత్రి సురేఖ చేత క్షమాపణలు చెప్పించాలని ఆశిస్తున్నాను. మంత్రి సురేఖ అర్థం పర్థం లేని మాటలను ఖండించాలని సినీ పరిశ్రమను అభ్యర్థిస్తున్నాను’’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.