Share News

Hyderabad: అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రహరీ కూల్చివేత

ABN , Publish Date - Oct 24 , 2024 | 04:24 AM

సుందరీకరణలో భాగంగా లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం చుట్టూ జీహెచ్‌ఎంసీ ప్రహరీ నిర్మించడం వివాదాస్పదమైంది.

Hyderabad: అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రహరీ కూల్చివేత

  • విగ్రహం కనిపించకుండా నిర్మించారంటూ.. లోయర్‌ట్యాంక్‌బండ్‌లో దళిత సంఘాల ఆందోళన

హైదరాబాద్‌ సిటీ/కవాడిగూడ/హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): సుందరీకరణలో భాగంగా లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం చుట్టూ జీహెచ్‌ఎంసీ ప్రహరీ నిర్మించడం వివాదాస్పదమైంది. మంగవారం రాత్రి అంబేడ్కర్‌ విగ్రహ పరిరక్షణ సమితి నాయకుడు గుడిమల్ల వినోద్‌ కుమార్‌ తన అనుచరులతో కలిసి.. అదేరోజు అర్ధరాత్రి అక్కడకు చేరుకుని దానిని కూల్చివేశారు. విగ్రహం వద్ద బైఠాయించి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం జరిగేలా నిర్మాణాలు చేపడితే ఊర్కోబోమని హెచ్చరించారు.


బుధవారం మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య, జైభీంసేన ఫైట్‌ ఫర్‌ రైట్‌ అధినేత బల్వంతరావు తదితరులు అంబేడ్కర్‌ విగ్రహంవద్ద నిరసన వ్యక్తం చేశారు. అభిప్రాయ సేకరణ తర్వాతే సుందరీకరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఏసీపీ సంజయ్‌ కుమార్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ.. సుందరీకరణ పేరుతో ప్రహరీ నిర్మించి అంబేడ్కర్‌ విగ్రహం కనిపించకుండా చేయడం దారుణమని మండిపడ్డారు. మరోవైపు.. ప్రహరీ కూల్చివేత విషయంపై జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు సైఫాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


  • కేటీఆర్‌ ప్రేరణతోనే ప్రహరీ కూల్చివేత: కాంగ్రెస్‌

బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఆయన పీఏ బండారు తిరుపతి, పార్టీ నేత క్రిశాంక్‌లపైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ కాంగ్రెస్‌ నేతలు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు ఈరవత్రి అనిల్‌, నాగరిగారి ప్రీతం, మెట్టు సాయికుమార్‌లు అదనపు డీజీ మహే్‌షభగవత్‌ను కోరారు. బుధవారం అదనపు డీజీని ఆయన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం చుట్టూ నిర్మించిన ప్రహరీని బీఆర్‌ఎ్‌సకు చెందిన కొందరు కూల్చి వేశారని డీజీ దృష్టికి తెచ్చారు. కేటీఆర్‌, క్రిశాంక్‌, బండారు తిరుపతి, బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ప్రేరణతోనే వారు ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 04:24 AM