Share News

Hydrabad: latesఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు

ABN , Publish Date - Jun 23 , 2024 | 04:24 AM

అవినీతి, అక్రమాలకు తోడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్‌ చేయడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన మరో ముగ్గురినీ ఐజీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు.

Hydrabad: latesఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు

  • మరో ముగ్గురు ఐజీ ఆఫీసుకు అటాచ్‌

  • అవినీతి, అధికార దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యమే కారణం..

  • మల్టీజోన్‌-1 ఐజీ రంగనాథ్‌ ఉత్తర్వులు

హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): అవినీతి, అక్రమాలకు తోడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్‌ చేయడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన మరో ముగ్గురినీ ఐజీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. ఈ మేరకు మల్టీజోన్‌-1 ఐజీ ఏవీ రంగనాథ్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలోని సత్తుపల్లి గ్రామీణ ప్రాంతంలో పేకాట కేంద్రాలు నిర్వహిస్తునట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలోనే పేకాట కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించి పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేశారు. అయితే వారిని విచారించగా.. సత్తుపల్లి గ్రామీణ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.వెంకటేశం పేకాట కేంద్రాలను ప్రోత్సహించేవాడని తేలింది. పోలీసు దాడులకు సంబంధించి నిర్వాహకులకు ముందస్తు సమాచారమిచ్చేవాడని.. అందుకు ప్రతిఫలంగా పెద్ద మొత్తంలో లంచం తీసుకునే వాడని వెల్లడైంది.


దీంతో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశంను సస్పెండ్‌ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఘటనలో ఇదే కమిషనరేట్‌ పరిధిలో ఖమ్మం పట్టణంలో 2022-23 మధ్యకాలంలో ఖమ్మం టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన సి.హెచ్‌. శ్రీధర్‌ స్థానిక విలేకరి ఇంట్లో ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీ తూటాలు దొరికినట్లు తప్పుడు కేసు బనాయించి పంచనామా రాయించినట్లు తేలింది. ఓ పాత కేసులో ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ నిందితుడికి అనుకూలంగా వ్యవహరిస్తూ సమాచారం ఎప్పటికప్పుడు అతడికి చేరవేసేవాడని ఫిర్యాదు అందింది. అలాగే ఈ కేసు అండర్‌ ఇన్వెస్టిగేషన్‌ (యూఐ) జాబితాలో కూడా లేకుండా చేసినట్లు తేలింది. దీనిపై విచారణ చేపట్టిన ఖమ్మం సీపీ.. ఐజీకి అందజేసిన నివేదికలో ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. దీంతో.. ప్రస్తుతం ములుగు జిల్లాలో స్పెషల్‌ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీధర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.


ఐజీ కార్యాలయానికి ముగ్గురి అటాచ్‌..

ఇక ఇటీవల మెదక్‌ జిల్లాలో జరిగిన మత కలహాల సమయంలో మెదక్‌ పట్టణ, రూరల్‌ పోలీస్‌ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.దిలీప్‌ కుమార్‌, బి.కేశవులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇటు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీ్‌సస్టేషన్‌ ఎస్సై భవానీసేన్‌ కేసు వ్యవహారంలో.. మహదేవ్‌పూర్‌ సీఐ బి.రాజేశ్వర్‌రావు ఎస్సై పనితీరు, వ్యవహార శైలిపై పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యం వహించినట్లు వెల్లడైంది. దీంతో ఈ ముగ్గురిని తన కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఐజీ రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jun 23 , 2024 | 04:24 AM