Share News

మంత్రిగా ఉండి అలా మాట్లాడటం తగదు

ABN , Publish Date - Oct 26 , 2024 | 03:54 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వేసిన రూ.100 కోట్ల సివిల్‌ పరువు నష్టం దావా కేసుకు సంబంధించి మంత్రి కొండా సురేఖపై హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

మంత్రిగా ఉండి అలా మాట్లాడటం తగదు

  • ఆ వ్యాఖ్యలు సమాజంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది

  • కేటీఆర్‌ వేసిన పరువు నష్టం దావాలో

  • మంత్రి కొండా సురేఖపై కోర్టు ఆగ్రహం

  • ఈ విషయమై మరోసారి కేటీఆర్‌పై

  • ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచన

  • మంత్రి మాట్లాడిన వీడియోలు, వార్తలు

  • తొలగించాలని సోషల్‌ మీడియాకు ఆదేశాలు

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వేసిన రూ.100 కోట్ల సివిల్‌ పరువు నష్టం దావా కేసుకు సంబంధించి మంత్రి కొండా సురేఖపై హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినీ నటులు నాగచైతన్య-సమంతల విడాకుల విషయమ్మీద కేటీఆర్‌పై సురేఖ చేసిన వ్యాఖ్యలు సమాజంపై చెడు ప్రభావం చూపే అవకాశముందని, అందుకే ప్రజా వీక్షక సాధానాల్లో ఈ ఉదంతానికి సంబంధించిన సమాచారాన్నంతా వెంటనే తొలగించాలని ఆదేశించింది. బాధ్యత గల ఓ మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని జడ్జి విస్మయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


మంత్రి పదవిలో ఉండి అసభ్యకరంగా మాట్లాడటం తగదని సురేఖను మందలించింది. ఈ విషయమై మరోసారి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. సురేఖతో పాటు ఆమెకు సంబంధించిన వారు, అనుచరులు కూడా ఇకపై ఈ విషయమై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ ఉదంతానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రజా వీక్షక సాఽధనాల్లో నుంచి తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. యూట్యూబ్‌తో పాటు ఫేస్‌బుక్‌, గూగుల్‌, మెటా తదితర అన్ని సోషల్‌మీడియా వేదికల నుంచి సురేఖ మాట్లాడిన వీడియోలు, వార్తలు తొలగించాలని ఆ సంస్థలకు ఉత్తర్వులిచ్చింది.

Updated Date - Oct 26 , 2024 | 03:54 AM