Share News

Cyber Crime: లోన్‌ ఇప్పించి మరీ రూ.20 లక్షల సైబర్‌ దోపిడీ!

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:57 AM

సైబర్‌ కేటుగాళ్లు రోజురోజుకు తెలివి మీరిపోతున్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు లేకున్నా లోను ఇప్పించి మరీ దోచుకుంటున్నారు.. డ్రగ్స్‌ పార్సిల్‌ పేరిట ఓ మహిళను భయపెట్టిన నేరగాళ్లు.

Cyber Crime: లోన్‌ ఇప్పించి మరీ రూ.20 లక్షల సైబర్‌ దోపిడీ!

  • డ్రగ్స్‌ పార్సిల్‌ పేరిట మహిళను భయపెట్టి మోసం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ కేటుగాళ్లు రోజురోజుకు తెలివి మీరిపోతున్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు లేకున్నా లోను ఇప్పించి మరీ దోచుకుంటున్నారు.. డ్రగ్స్‌ పార్సిల్‌ పేరిట ఓ మహిళను భయపెట్టిన నేరగాళ్లు.. రూ.20 లక్షల ఫ్రీ అప్రూవ్‌డ్‌ లోన్‌ ఇప్పించి మరీ కొట్టేశారు..! చివరకు మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన 44 ఏళ్ల బాధితురాలు ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు రెండ్రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి స్కైప్‌ వీడియో కాల్‌ వచ్చింది. ఆమె స్పందించి మాట్లాడగా.. అవతలి వ్యక్తి ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసునంటూ పరిచయం చేసుకున్నాడు.


ఆమె పేరు, అడ్ర్‌సతో ముంబై నుంచి ఇరాన్‌కు వెళ్తున్న ఒక డ్రగ్స్‌ పార్సిల్‌ను పట్టుకున్నామని చెప్పాడు. దీనికి సంబంధించి కేసు నమోదైందని పలు పత్రాలను చూపించాడు. అలాగే ఆమె ఆధార్‌ కార్డుతో మొత్తం 30 బ్యాంకు ఖాతాలు తెరిచి ఉన్నాయని.. మనీలాండరింగ్‌ జరిగిందని భయపెట్టాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొదని.. దేశభద్రతకు సంబంధించిన వ్యవహారమని హెచ్చరించాడు. తక్షణమే రూ.20 లక్షలు ఆర్బీఐకి చెందిన ఓ ఖాతాకు పంపించాలని సూచించాడు. దాంతో బాధితురాలు తన ఖాతాల్లో నగదు లేదని చెప్పగా.. ఆమె సిబిల్‌ స్కోర్‌ తెలుసుకొని వారే ఫ్రీ అప్రూవ్‌డ్‌ లోన్‌ ఇప్పించారు. ఆమె ఖాతాలో లోన్‌ డబ్బులు పడగానే రూ. 20 లక్షలు కొట్టేశారు.. అక్రమాలకు పాల్పడలేదని తేలితే ఆ డబ్బులు తిరిగి వెనక్కి వస్తాయని నమ్మించి కాల్‌ కట్‌ చేశారు. అయితే డబ్బులు తిరిగి రాకపోవడం, ఫోన్‌ చేస్తే ఏ స్పందన లేకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Updated Date - Oct 15 , 2024 | 04:57 AM