Share News

Cyber Crime: రీల్స్‌తో డబ్బుల ఆశ చూపి.. ఖాతాలు ఖాళీ చేసి..

ABN , Publish Date - Dec 01 , 2024 | 04:34 AM

‘ఇంట్లోనే కూర్చొని రోజుకు రూ.వేలల్లో సంపాదించే అవకాశం. డీమాట్‌ ఖాతా, స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. స్టాక్‌ ట్రేడింగ్‌ చేయవచ్చు. మేం చెప్పిన విధంగా పెట్టుబడులు పెట్టండి.

Cyber Crime: రీల్స్‌తో డబ్బుల ఆశ చూపి..  ఖాతాలు ఖాళీ చేసి..

  • స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో రీల్స్‌ .. భారీగా లాభాలు వస్తాయంటూ ఊరించే ప్రకటనలు

  • ప్రముఖ ట్రేడింగ్‌ సంస్థలు, బ్యాంకుల లోగోల వినియోగం

  • నకిలీ యాప్‌ల ద్వారా వల వేసి దోపిడీ

  • లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్న బాధితులు

  • అడ్డగోలు ప్రచారాన్ని చూసి మోసపోవద్దంటున్న నిపుణులు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘ఇంట్లోనే కూర్చొని రోజుకు రూ.వేలల్లో సంపాదించే అవకాశం. డీమాట్‌ ఖాతా, స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. స్టాక్‌ ట్రేడింగ్‌ చేయవచ్చు. మేం చెప్పిన విధంగా పెట్టుబడులు పెట్టండి. ఆసక్తి ఉన్నవారు కింద బయోలో ఉన్న లింక్‌ ద్వారా సంప్రదించండి’ అంటూ తెలుగు, ఇంగ్లీషు, హిందీలో రూపొందించిన రీల్స్‌ ఇటీవల ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, స్పాప్‌చాట్‌ తదితర సోషల్‌ మీడియాలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. వీటిని చూసి నిజమని భావించి ఎంతోమంది సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్నారు. కరోనా సమయంలో ఇంటికే పరిమితం కావడంతో చాలామంది సోషల్‌ మీడియాకు అలవాటు పడ్డారు. రీల్స్‌ చూడటం దినచర్యలో భాగంగా మారిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్న సైబర్‌ నేరగాళ్లు స్టాక్‌ ట్రేడింగ్‌ చేస్తే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయంటూ రీల్స్‌ చేసి పోస్ట్‌ చేస్తున్నారు. నమ్మకం కలిగించేందుకు గోల్డ్‌మెన్‌శాక్స్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ వంటి ప్రముఖ సంస్థల పేర్లను వాడుకుంటున్నారు.


  • శిక్షణ ఇచ్చి.. కొంత లాభాలు ఎరవేసి..

రీల్స్‌ చూసి, ట్రేడింగ్‌ చేద్దామని భావించి సంప్రదించిన వాళ్లను సైబర్‌ నేరగాళ్లు టెలిగ్రాం గ్రూపుల్లో చేర్చుతున్నారు. స్టాక్‌ ట్రేడింగ్‌ గురించి కొంత అవగాహన కలిగించేలా శిక్షణ ఇస్తున్నారు. ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టి వారెన్‌ బఫెట్‌ వంటి ప్రముఖులు కోట్లు సంపాదించారంటూ ఆశలు రేకెత్తిస్తారు. మొబైల్‌కు లింక్‌ పంపి, బ్యాంకు లోగోలు ఉన్న యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయిస్తారు. అధిక రాబడి కావాలంటే తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెట్టాలని పేర్కొని సలహాలు ఇవ్వటం మొదలుపెడతారు. నమ్మకం వచ్చేందుకు ముందుగా కొద్ది మొత్తాలు పెట్టుబడి పెట్టాలంటారు. పెట్టుబడి రోజుల వ్యవధిలోనే రెట్టింపు అయిందని యాప్‌లో చూపుతారు. కొంత మొత్తాలు విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని వెంటపడతారు. గ్రూపులో ఇతర సభ్యులు కూడా తాము పెట్టిన పెట్టుబడికి 150 శాతం లాభాలు వచ్చాయని పోస్టింగ్‌లు పెడుతూ ఊరిస్తారు. ఈ సభ్యులు సదరు మోసగాళ్ల గ్యాంగు సభ్యులే. వీరి మాటలను నమ్మిన బాధితులు పర్సనల్‌ లోన్‌లు, స్నేహితులు, బంధువుల వద్ద అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టి నిండా మునుగుతున్నారు. హైదరాబాద్‌లో ఉండే ఓ ఐటీ ఉద్యోగి పెట్టిన పెట్టుబడికి ఒక్క రోజులో రూ.7 లక్షల లాభం ఇచ్చిన సైబర్‌ నేరగాళ్లు.. తర్వాత క్రమంగా అతనితో పెద్ద మొత్తాలు పెట్టుబడులు పెట్టించి రూ.2.40 కోట్లు కాజేశారు. వీరు పంపే యాప్‌లలో తొలుత విత్‌డ్రా ఆప్షన్‌ కల్పించి.. ఆ తర్వాత అది లేకుండా చేసి డబ్బులు దోచుకుంటున్నారు. ట్రేడింగ్‌ మోసాల బాధితుల్లో ఎక్కువ మంది రీల్స్‌ చూసి ఆకర్షితులైన వారే ఉంటున్నారు. పలువురు విద్యాధికులు, ఐటీ ఉద్యోగులు ఉండటం గమనార్హం. వీరిలో చాలామందికి స్టాక్‌ ట్రేడింగ్‌ గురించి కనీస అవగాహన కూడా ఉండటం లేదు. తక్కువ సమయంలో పెట్టుబడికి 100 శాతం లాభాలు రావడం సాధ్యం కాదన్న విషయాన్ని కూడా వీరు గుర్తించడం లేదు. మోసపోయాకగానీ అసలు విషయాన్ని గుర్తించటం లేదు. ఈ నేపథ్యంలో, సోషల్‌ మీడియాలో ట్రేడింగ్‌ గురించి అడ్డగోలుగా ప్రచారం చేసుకునే వారిని నమ్మొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Dec 01 , 2024 | 04:34 AM