Online Trading: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.8.14 కోట్ల మోసం
ABN , Publish Date - Dec 02 , 2024 | 03:29 AM
ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసంలో కీలకపాత్ర వహించిన ఇద్దరిని రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ట్రేడింగ్ పేరిట హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన ఓ బాధితుడి నుంచి ఈ ముఠా రూ.8.14 కోట్లు కాజేసింది.
బంజారాహిల్స్ బాధితుడి నుంచి కాజేసిన మోసగాళ్లు
రాజస్థాన్‌లో ఇద్దరి అరె స్టు
హైదరాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసంలో కీలకపాత్ర వహించిన ఇద్దరిని రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ట్రేడింగ్ పేరిట హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన ఓ బాధితుడి నుంచి ఈ ముఠా రూ.8.14 కోట్లు కాజేసింది. అయితే ఈ ముఠా సూత్రధారి శ్రవణ్ కుమార్‌ను ఇటీవలే అరెస్టు చేశామని, అతనికి పలు బ్యాంకులకు సంబంధించిన కరెంట్ అకౌంట్ ఖాతాలు ఇచ్చి వాటిలోకి వచ్చిన డబ్బును ఇతర ఖాతాలకు మళ్లించడంలో కీలకపాత్ర పోషించిన ఉదయ్‌పూర్‌కు చెందిన రాహుల్ డాంగీ, రాహుల్ బోయ్‌ను అరెస్టు చేసినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. వీరిద్దరినీ ట్రాన్సిట్ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్టు చెప్పారు.
రాహుల్ డాంగీ.. శ్రీ సన్వారియా ఫర్నీచర్స్ పేరిట కరెంట్ అకౌంట్ ఖాతాను నిర్వహిస్తున్నాడని, ఇందులోకి ట్రేడింగ్ ద్వారా తాము టార్గెట్ చేసిన వ్యక్తుల నుంచి డబ్బు టాన్స్‌ఫర్ చేస్తారని, బంజారాహిల్స్ బాధితుడికి సంబంధించిన రూ.75లక్షలు ఈ ఖాతాకు బదిలీ అయినట్టు షికా గోయల్ చెప్పారు. వెంటనే రాహుల్ ఆ డబ్బును 25 ఖాతాలకు మళ్లించినట్టు తెలిపారు. అలాగే రాహుల్ బోయ్ 5 ఖాతాలను నిందితులకు ఇచ్చాడని, వీటిలోని రెండు ఖాతాలకు బంజారాహిల్స్ బాధితుడి నుంచి మిగతా డబ్బు బదిలీ అయినట్టు చెప్పారు. మోసగాళ్లు వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ట్రేడింగ్ టిప్స్ ఇచ్చి ముందు డబ్బు వచ్చేలా చేస్తారని, తర్వాత తాము అనుకున్న మొత్తాన్ని కొట్టేసి ఫోన్లు స్విచాఫ్ చేస్తారన్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని షికా గోయల్ సూచించారు.