HYD : సేవ్ దామగుండం..
ABN , Publish Date - Sep 23 , 2024 | 03:45 AM
రాజధానికి అతి దగ్గరలో వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో 3 వేల ఎకరాల రక్షిత అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.
భావి తరాల కోసం ఆ అడవిని కాపాడుకోవాలి
ధర్నా చౌక్‌లో జేఏసీ నేతల నిరసన
కవాడిగూడ/హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాజధానికి అతి దగ్గరలో వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో 3 వేల ఎకరాల రక్షిత అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. లేదంటే పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి స్టేషన్ నిర్మాణ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. భావి తరాలకు మంచి ఆరోగ్యం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని కోరారు. సేవ్ దామగుండం జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, మెతుకు ఆనంద్, సామాజికవేత్త చెరుకు సుధాకర్, సేవ్ దామగుండం జేఏసీ కో ఆర్డినేటర్ రామన్న మాదిగ, నిర్వాహకురాలు గీత హాజరయ్యారు. పరిగి, వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రకృతి ప్రేమికులు పెద్దఎత్తున తరలివచ్చారు. రాడార్ స్టేషన్ కోసం.. దామగుండం అడవిలోని 12 లక్షల చెట్లను తొలగించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయని వక్తలు ఆరోపించారు.
అనేక సంవత్సరాలుగా జంట నగరాలకు వన మూలికలు అందిస్తున్న అడవిలో.. నరికివేసిన వాటి స్థానంలో 12 లక్షల మొక్కలను నాటుతామని చెప్పడం దారుణమన్నారు.అడవుల నరికివేతకు అనుమతులిచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే తొలిస్థానంలో ఉందన్న సంగతిని గుర్తుచేశారు. ఉన్న చెట్లను తొలగించి ప్రజలకు ఎలాంటి ఆరోగ్యం అందిస్తారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కలను పెంచాలంటూ పథకాలు తెస్తూనే.. అడవిలోని 12 లక్షల చెట్లను ఎలా తొలగిస్తారని నిలదీశారు. ప్రభు త్వం మొండిగా ముందుకెళ్తే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని సేవ్ దామగుండం నేతలు హెచ్చరించారు. ధర్నాలో పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, ఆదివాసీ సంఘం నేత రవీందర్, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.
అవసరమే.. కానీ, అక్కడొద్దు: సీపీఎం
దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. రాడార్ స్టేషన్ అవసరమేనని, అయితే.. దామగుండంలో కాకుండా మరో ప్రాంతానికి దాన్ని తరలించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు.