బీసీ కమిషన్ మారుతుందా?
ABN , Publish Date - Aug 26 , 2024 | 04:52 AM
రాష్ట్రంలో కొత్త బీసీ కమిషన్ వస్తుందా, లేదా ఉన్నదాన్నే కొనసాగిస్తారా అని చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగణన చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఉన్నదే కొనసాగుతుందా?
కులగణన, స్థానిక ఎన్నికల నేపథ్యంలో చర్చ
హైదరాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త బీసీ కమిషన్ వస్తుందా, లేదా ఉన్నదాన్నే కొనసాగిస్తారా అని చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కులగణన చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత ఆరు నెలలుగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అభివృద్ధి పనులు, ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధుల విడుదల కోసం స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో పనులు చేయించిన సర్పంచులు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. తమ బకాయిలు ఇప్పించాలని అడుగుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని, దీనికోసం కుల గణన పూర్తి చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక కూడా దీన్ని నిలబెట్టుకుంటామని పలుమార్లు ప్రకటిస్తూ వస్తోంది. మూడు రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని మరొకసారి నొక్కి చెప్పారు. దాంతో బీసీ కమిషన్ విషయం కూడా చర్చకు వస్తోంది. కుల గణన ప్రక్రియ సాధారణంగా బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంటుంది. గణన ఎవరూ చేసినా డేటా మొత్తం బీసీ కమిషన్‌కు అందజేయాలి.
అపుడు కమిషన్ ఆ డేటాను విశ్లేషించి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి రిజర్వేషన్ల కోటాను ఖరారు చేయాల్సి ఉంటుంది. గతంలో సుప్రీం కోర్టు చెప్పిన ట్రిపుల్ టీ నియమం ప్రకారం ఇదే పద్ధతి అనుసరించాలి. ట్రిపుల్ టీలో భాగంగా డెడికేడెట్ బీసీ కమిషన్ కులాల వారి డేటా విశ్లేషణ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల రిజర్వేషన్ 50 శాతం మించకుండా చూడాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బీసీ కమిషన్‌కు టీవోఆర్ (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) జారీ చేయాలి. అంటే కమిషన్ విధివిధానాలు నిర్ణయిస్తూ టీవోఆర్ జారీ చేయాలి. అప్పుడే కుల గణన మొదలవుతుంది. అయితే ఇది కొత్త కమిషన్‌తో చేయిస్తారా? లేదంటే ప్రస్తుత కమిషన్‌నే కొనసాగిస్తారా? అన్నది ప్రస్తుతం చర్చగా సాగుతోంది.
కుల గణనపై ఇప్పటికే నివేదికల సమర్పణ
బీసీ కమిషన్‌లో చైర్మన్ వకుళాభరం కృష్ణమోహన్ సహా మరో ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఈ కమిషన్ ఇప్పటికే కులగణనపై కొంత కసరత్తు చేసింది. స్థానిక సంస్థల కోసమే గణన చేస్తే ఎలా చేయాలి? విద్యా ఉద్యోగ, రాజకీయ, సామాజిక స్థితిగతులు అంచనా వేసేలా విస్తృత స్థాయిలో కులగణన ఎలా చేయాలి? అనే విషయంలో ప్రభుత్వానికి పలు నివేదికలు ఇచ్చింది. ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, అక్కడ ఎదురైన న్యాయపరమైన చిక్కుల గురించి కూడా వివరించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో కొత్త కమిషన్ వచ్చి.. విషయం పట్ల అవగాహన చేసుకునే వరకు సమయం పడుతుందని, ఉన్న కమిషన్‌ను కొనసాగించడం మంచిదేమోనన్న వాదన వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం పాత వారితో వెళ్లిపోవడమా, పూర్తిగా తమ ముద్రతో కొత్త కమిషన్ ఏర్పాటు చేసుకోవడమా అనే విషయంలో ఏ నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించడం లేదు. కులగణనపై అంతర్గతంగా ఒక ప్రణాళిక రచిస్తున్న తీరులోనే కమిషన్ విషయంలో ఏం చేయాలనే కసరత్తు కూడా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత రిజర్వేషన్లు
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం, బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు కొనసాగాయి. గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవి. కానీ సుప్రీం కోర్టు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని తీర్పు వెలువరించడంతో ఎస్సీ,ఎస్టీలకు 27 శాతం పోనూ బీసీలకు 23 శాతం కేటాయించారు. 2018 తెలంగాణ పంచాయితీ చట్టంలో బీసీలకు వాస్తవానికి 34 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అయితే తర్వాత సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాటిని 23 శాతానికి తగ్గించారు.