colleges: డిగ్రీ కళాశాలల బంద్ విరమణ
ABN , Publish Date - Oct 18 , 2024 | 04:03 AM
రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో బంద్‌ను విరమించుకుంటున్నట్టు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో శుక్రవారం నుంచి డిగ్రీ కళాశాలలు యథావిధిగా నడుస్తాయని తెలిపాయి.
రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో బంద్‌ను విరమించుకుంటున్నట్టు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో శుక్రవారం నుంచి డిగ్రీ కళాశాలలు యథావిధిగా నడుస్తాయని తెలిపాయి. ఫీజు రీ- యింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు నాలుగు రోజుల నుంచి బంద్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆయన సూచన మేరకు విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశంతో కూడా కళాశాలల ప్రతినిధులు చర్చించారు.
ఈ చర్చలు సఫలం కావడంతో బంద్ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ఫీజు బకాయిల విడుదలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుముఖంగా ఉన్నారని, చర్చల సందర్భంలో విద్యాశాఖ కార్యదర్శి కళాశాలల ప్రతినిధులకు తెలిపారు. త్వరలోనే ఈ నిధులు విడుదలవుతాయని స్పష్టం చేశారు. దాంతో బంద్‌ను విరమిస్తున్నట్టు కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి.