Share News

Yadagirigutta: భక్తజనసంద్రం.. యాదాద్రి క్షేత్రం

ABN , Publish Date - Nov 04 , 2024 | 05:09 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రమైంది. కార్తీక మాసం రెండో రోజు, వారాంతపు సెలవుదినం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు.

Yadagirigutta: భక్తజనసంద్రం.. యాదాద్రి క్షేత్రం

  • కార్తీక మాసం నేపథ్యంలో ఆలయ తిరువీధుల్లో రద్దీ

  • ఇష్టదైవాలను దర్శించుకున్న 50 వేలమంది భక్తులు

  • ధర్మదర్శనానికి 2గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట

భువనగిరి అర్బన్‌, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రమైంది. కార్తీక మాసం రెండో రోజు, వారాంతపు సెలవుదినం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. వాహనాలతో పార్కింగ్‌ స్థలం నిండిపోగా క్షేత్రం చుట్టూ ఉన్న రింగ్‌రోడ్డులో కూడా వాహనాలను పార్కింగ్‌ చేశారు. కార్తీకమాసం పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సత్యదేవుడి వ్రతాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపారాధన స్థలాల్లో భక్తులతో రద్దీ నెలకొంది. కొండపైన గర్భాలయంలో పాంచనారసింహులతోపాటు శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.


ప్రత్యేక, ధర్మదర్శన క్యూలైన్లలో వచ్చిన సుమారు 50వేల మంది భక్తులు ఇష్టదైవాలను దర్శించుకున్నారు. వీఐపీ టికెట్‌(రూ.150) దర్శనానికి ఒక గంట, ధర్మ దర్శనానికి 2గంటల సమయం పట్టింది. కాగా, క్యూకాంప్లెక్స్‌లతోపాటు ప్రధానాలయం, కల్యాణోత్సవం, వ్రత మండపాలు, ఆలయ తిరువీధులు, శివాలయం, ప్రసాద విక్రయశాల, కొండకింద వ్రత మండపం, లక్ష్మీపుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణ కట్ట తదితర ప్రాంగణాలు భక్తులతో రద్దీగా మారాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.60,82,772 ఆదాయం సమకూరినట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

Updated Date - Nov 04 , 2024 | 05:09 AM