Diabetes: షుగర్ ఉన్నా లేనట్టే!
ABN , Publish Date - Nov 04 , 2024 | 03:50 AM
భారతదేశానికి ‘మధుమేహ రాజధాని’ అనే పేరుంది! ప్రపంచవ్యాప్తంగా ఉన్న చక్కెర వ్యాధి బాధితుల్లో 17 శాతం మంది మనోళ్లే! తాజా గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన షుగర్ పేషెంట్ల సంఖ్య 8 కోట్లు.
రక్తంలో చక్కెర స్థాయుల ఆధారంగా పనిచేసే స్మార్ట్ ఇన్సులిన్
ఇన్సులిన్ హార్మోన్‌లో రెండు చోట్ల మార్పులు
చేయడం ద్వారా ‘ఎన్‌ఎన్‌సీ 2215’ అభివృద్ధి
యూకే, డెన్మార్క్ ‘ఫార్మా’ శాస్త్రవేత్తల ఘనత
మధుమేహ బాధితులకు శుభవార్త. ఇన్సులిన్ డోసులో తేడాల కారణంగా రక్తంలో చక్కెర స్థాయులు పడిపోయే సమస్యకు అడ్డుకట్ట వేసే ‘స్మార్ట్ ఇన్సులిన్’ను శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. అంటే.. ఇంజెక్షన్ ఇవ్వగానే రక్తంలో కలిసిపోయి పని మొదలెట్టడం కాకుండా.. కాస్తంత ఆగి.. షుగర్ లెవల్స్ ఎలా ఉన్నాయో చూసి, తక్కువగా ఉంటే నిశ్శబ్దంగా ఉండి, షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే మాత్రమే పనిచేసే తెలివైన ఇన్సులిన్ అన్నమాట!! ఇది మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే.. మధుమేహ బాధితులు చాలావరకూ సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది.
(సెంట్రల్ డెస్క్): భారతదేశానికి ‘మధుమేహ రాజధాని’ అనే పేరుంది! ప్రపంచవ్యాప్తంగా ఉన్న చక్కెర వ్యాధి బాధితుల్లో 17 శాతం మంది మనోళ్లే! తాజా గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన షుగర్ పేషెంట్ల సంఖ్య 8 కోట్లు. ఇంకా ఆస్పత్రుల రికార్డుల్లోకి ఎక్కని కేసులు మరెన్నో!! 2045 నాటికి రికార్డుల్లో ఉన్న లెక్కల ప్రకారమే భారత్‌లో మధుమేహుల సంఖ్య 13.5 కోట్లు దాటుతుందని అంచనా. దీనిబారిన పడితే.. కడుపు నిండా తిండి తినడానికి ఉండదు! ఎంతో ఇష్టమైన స్వీట్లపై మనసు చంపుకోవాల్సిందే!! పదే పదే దాహం వేస్తుంటుంది. మంచినీళ్లు ఎక్కువగా తాగేయడం వల్ల మాటిమాటికీ మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది.
క్రమంగా బరువు తగ్గిపోతారు. దీర్ఘకాలంపాటు షుగర్‌తో బాధపడేవారి శరీరంలో ఇతర అవయవాలపైనా దాని ప్రభావం పడుతుంది. కళ్లు దెబ్బతింటాయి. కిడ్నీల పనితీరు మందగిస్తుంది!! కొంచెం కొంచెంగా ప్రాణాలు తీసే ఈ తియ్యటి జబ్బుకు కళ్లాలు వేసి దాని జోరు తగ్గించేది ఇన్సులిన్. కానీ.. ఇన్సులిన్ మోతాదు ఎక్కువ తక్కువ అయితే దానివల్ల వేరే దుష్ప్రభావాలుంటాయి. ఎందుకంటే.. రక్తంలో చక్కెర స్థాయులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నప్పుడు.. రోజువారీ రొటీన్‌గా ఇన్సులిన్ తీసుకుంటే.. చక్కెరస్థాయులు మరింతగా పడిపోయి హైపోగ్లైసీమియాకు దారితీయొచ్చు. కొన్నిసందర్భాల్లో అది ప్రాణాంతకం కూడా అవుతుంది. అందుకే.. షుగర్ లెవల్స్ ఆధారంగా తగు మోతాదులో ఇన్సులిన్ విడుదల అయ్యే/విడుదల చేసే పరిజ్ఞానంపై 1970ల నుంచి.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన శాస్త్రజ్ఞులు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగానే.. డెన్మార్క్, యూకే తదితర దేశాలకు చెందిన ఫార్మా సంస్థల శాస్త్రజ్ఞులు మానవ ఇన్సులిన్ హార్మోన్‌లోని బీ29 (మాక్రోసైకిల్) ప్రాంతాన్ని, బీ1 (గ్లూకోసైడ్) ప్రాంతాన్ని మార్చడం ద్వారా.. రక్తంలోని చక్కెర స్థాయులకు అనుగుణంగా పనిచేసే ఇన్సులిన్ సంయోజకాన్ని తయారు చేశారు! దానికి ‘ఎన్‌ఎన్‌సీ 2215’ అని పేరు పెట్టారు.
ఈ స్మార్ట్ ఇన్సులిన్‌లోని మాక్రోసైకిల్ భాగం రింగు ఆకారంలో ఉంటుంది. గ్లూకోసైడ్ మాలిక్యూల్ గ్లూకోజ్ తరహాలో ఉంటుంది. రక్తంలో చక్కెరస్థాయులు పడిపోయినప్పుడు గ్లూకోసైడ్ మాలిక్యూల్ ఆ విషయాన్ని గ్రహించి వెళ్లి రింగ్ భాగానికి అతుక్కుంటుంది. అప్పుడు ఇన్సులిన్ పనిచేయడం మానేస్తుంది. దీనివల్ల చక్కెరస్థాయులు తగ్గడం ఆగుతుంది. అదే రక్తంలో చక్కెరస్థాయులు ఎక్కువగా ఉన్నప్పుడు.. గ్లూకోసైడ్ స్థానాన్ని గ్లూకోజ్ భర్తీ చేస్తుంది. వెంటనే తగు మోతాదులో ఇన్సులిన్ పనిచేస్తుంది. షుగర్ లెవల్స్ సురక్షిత స్థాయులకు చేరుకుంటాయి. అయితే, ఇదంతా ప్రస్తుతానికి ప్రయోగాల దశలో ఉంది. కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మనుషులపై పరీక్షలు పూర్తయి.. మార్కెట్లో అందుబాటులోకి రావడానికి మరికొంత కాలం పడుతుంది.హ్యూమన్ ట్రయల్స్ కూడా విజయవంతమవుతాయని, ఈ స్మార్ట్ ఇన్సులిన్ కూడా మన శరీరంలోని సహజ ఇన్సులిన్ అంత సమర్థంగా పనిచేస్తుందని దీని రూపకర్తలు నమ్మకంగా చెబుతున్నారు.