TG: గృహేతర విద్యుత్తు చార్జీల పెంపు!
ABN , Publish Date - May 23 , 2024 | 03:12 AM
రాష్ట్రంలో గృహేతర విద్యుత్తు చార్జీలను పెంచేందుకు డిస్కమ్‌లు కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 2024-25ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్‌ఆర్) నివేదికను విద్యుత్తు నియంత్రణ మండలికి సమర్పించాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా డిస్కమ్‌లు కోలుకోని విధంగా దెబ్బతిన్నాయి.
సర్కార్ అనుమతిస్తే చార్జీలు సవరించాలని యోచన
కోడ్ తర్వాత ఏఆర్‌ఆర్ దాఖలుకు డిస్కమ్‌ల నిర్ణయం
రూ.50వేల కోట్లకుపైగా నష్టాలతో డిస్కమ్‌ల ఎదురీత
ఉపశమనం పొందాలంటే చార్జీలు పెంచాల్సిన పరిస్థితి
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కోలుకోలేని దెబ్బ
హౖదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గృహేతర విద్యుత్తు చార్జీలను పెంచేందుకు డిస్కమ్‌లు కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 2024-25ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్‌ఆర్) నివేదికను విద్యుత్తు నియంత్రణ మండలికి సమర్పించాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా డిస్కమ్‌లు కోలుకోని విధంగా దెబ్బతిన్నాయి. లోపభూయిష్ట విధానాలకు తోడు, ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచే క్రమంలో డిస్కమ్‌లు నిండా మునిగాయి. 2022-23 వరకు లెక్కలను పరిశీలిస్తే రూ.50,275కోట్ల మేర నష్టాలను
డిస్కమ్‌లు మూటగట్టుకున్నాయి. దీనికితోడు 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సర ం దాకా ట్రూ-అప్ చార్జీలు రూ.12,550కోట్ల మేర ఉండగా... ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామని గత ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. కానీ, చివరకు చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు. ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో ఇవ్వాల్సిన రూ.2,378 కోట్లను ఎగ్గొట్టింది. ఇవి కాక 2023 అక్టోబరు 31వ తేదీ నాటికి ఎత్తిపోతల పథకాలతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలన్నింటి నుంచి డిస్కమ్‌లకు రూ.28,842.72కోట్లు రావాల్సి ఉంది. మరోవైపు.. విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి సింగరేణికి రూ.19,431కోట్ల దాకా డిస్కమ్‌లు బాకీ పడ్డాయి. ప్రతి నెలా రూ.1300కోట్లకుపైగా లోటుతో డిస్కమ్‌లు నడుస్తున్నాయి. వీటన్నింటి నుంచి ఉపశమనం పొందాలంటే చార్జీల పెంపు తప్ప.. మరో మార్గం లేకుండా పోయిందని డిస్కమ్‌లు చెబుతున్నాయి. కోడ్ ముగియగానే ప్రభుత్వానికి నివేదించి, అనుమతి లభించగానే గృహేతర విద్యుత్తు చార్జీలను సవరించాలని యోచిస్తున్నాయి.
డిస్కమ్‌ల నష్టాలు (రూ.కోట్లలో)
సంవత్సరం నష్టాలు
2014-15 2,513
2015-16 3,380
2016-17 6,202
2017-18 5,485
2018-19 8,019
2019-20 6,056
2020-21 6,686
2021-22 831
2022-23 18,728
మొత్తం 50,275
డిస్కమ్‌లకు రావాల్సిన బకాయిలు (రూ.కోట్లలో)
శాఖలు 2014 ప్రస్తుతం
జూన్2 నాటికి
ఎత్తిపోతల పథకాలు 150 14,193
మిషన్ భగీరథ 35 3,558
పంచాయతీరాజ్ 769 4,393
వాటర్‌బోర్డు 362 3,932
మున్సిపాల్టీలు 131 1,657
కేంద్రప్రభుత్వ 82 720
ఇతర అన్నిశాఖలు 1,595 28,842
2016-23 మధ్య ట్రూఅప్ 12,550
ఇంధన సర్దుబాటు చార్జీలు 2,378
మొత్తం 43,770