Share News

కలిసిపోయి ఉన్న కిడ్నీల మధ్యలో క్యాన్సర్‌ కణితి

ABN , Publish Date - Dec 23 , 2024 | 04:44 AM

ఓ మహిళకు పాన్‌కేక్‌ ఆకారంలో ఉన్న మూత్రపిండాల మధ్య ఏర్పడిన క్యాన్సర్‌ కణితిని కీహోల్‌ సర్జరీతో ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ(ఏఐఎన్‌యూ) వైద్యులు తొలగించారు.

కలిసిపోయి ఉన్న కిడ్నీల మధ్యలో క్యాన్సర్‌ కణితి

  • కీహోల్‌ సర్జరీతో తొలగించిన ఏఐఎన్‌యూ వైద్యులు

  • ఇది అత్యంత అరుదైన శస్త్రచికిత్స అని ఆస్పత్రి వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఓ మహిళకు పాన్‌కేక్‌ ఆకారంలో ఉన్న మూత్రపిండాల మధ్య ఏర్పడిన క్యాన్సర్‌ కణితిని కీహోల్‌ సర్జరీతో ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ(ఏఐఎన్‌యూ) వైద్యులు తొలగించారు. కొంపల్లి ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల మహిళకు పుట్టుకతోనే రెండు కిడ్నీలు కలిసిపోయి ఉండడంతో పాటు.. వాటిలో కుడివైపు కిడ్నీ ఉండాల్సిన ప్రదేశంలో కాకుండా కింది భాగంలో ఏర్పడింది. పైగా మామూలుగా కిడ్నీ అంటే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. కానీ ఈ కేసులో మాత్రం అవి పాన్‌కేక్‌ మాదిరిగా ఉన్నాయి. తాజాగా ఆ రెండింటికీ మధ్యలో క్యాన్సర్‌ కణితి ఏర్పడిందని, దానిని కీ హోల్‌ ప్రక్రియతో తొలగించినట్లు ఆస్పత్రికి చెందిన రోబోటిక్‌, యూరో ఆంకాలజీ విభాగం డైరెక్టర్‌ ఎస్‌ఎం గౌస్‌, ఎండీ మల్లికార్జున తెలిపారు.


‘‘కలిసిపోయిన కిడ్నీల మధ్యలో కణితి ఏర్పడితే దాన్ని కనిపెట్టడమే చాలా కష్టం. కిడ్నీలకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు కూడా ఎక్కడున్నాయో గుర్తించాల్సి ఉంటుంది. ఏఐఎన్‌యూ వైద్యులు సీటీ స్కాన్‌ చేసి, దాన్ని ఒక సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించడం ద్వారా 3డీ ఇమేజ్‌ సృష్టించించారు. దాని సాయంతో అసలు కిడ్నీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి రక్తసరఫరా ఎటు నుంచి జరుగుతోంది, కణితి ఎక్కడుందన్న విషయాలను గుర్తించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కీహోల్‌ ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించారు’’ అని వివరించారు. 2వారాల క్రితం సర్జరీ చేశామని, రోగి పూర్తిగా కోలుకోవడంతో మూడో రోజునే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశామని తెలిపారు. పాన్‌కేక్‌ కిడ్నీలు ఉండడమే అరుదని, 3.75 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుందని తెలిపారు.

Updated Date - Dec 23 , 2024 | 04:44 AM