Share News

DRDO: క్షిపణుల తయారీలో భారత్‌ నంబర్‌ వన్‌

ABN , Publish Date - Dec 01 , 2024 | 04:01 AM

క్షిపణుల తయారీ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని, సరికొత్త ఆవిష్కరణలతో మన రక్షణ విభాగం అత్యంత శక్తిమంతంగా మారిందని డీఆర్‌డీవో చైర్మన్‌ సమీర్‌ వీ కామత్‌ అన్నారు.

DRDO: క్షిపణుల తయారీలో భారత్‌ నంబర్‌ వన్‌

  • సాంకేతిక ప్రగతి, డీఆర్డీవోకు సహకారంలో నిట్‌ పాత్ర కీలకం

  • వరంగల్‌ నిట్‌ స్నాతకోత్సవంలో డీఆర్‌డీవో చైర్మన్‌ కామత్‌

హనుమకొండ, నవంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): క్షిపణుల తయారీ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని, సరికొత్త ఆవిష్కరణలతో మన రక్షణ విభాగం అత్యంత శక్తిమంతంగా మారిందని డీఆర్‌డీవో చైర్మన్‌ సమీర్‌ వీ కామత్‌ అన్నారు. శనివారం వరంగల్‌ నిట్‌లో 22వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో మొట్టమొదటి ప్రాంతీ య ఇంజనీరింగ్‌ కాలేజీ స్థాయి నుంచి జాతీయ సాంకేతిక కళాశాలగా ఎదిగిన వరంగల్‌ నిట్‌ ప్రస్థానం అద్వితీయమని కొనియాడారు. అత్యున్నత విద్యా ప్రమాణాలను అందించడం, ఆవిష్కరణలకు జీవం పోయడం, నూతన సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా తనను తాను మలుచుకోవడం ద్వారా నిట్‌ తన ప్రస్థానాన్ని విప్లవాత్మకంగా సాగిస్తోందన్నారు.


దేశాభివృద్ధిలో, సాంకేతిక ప్రగతిలో, డీఆర్‌డీవోకు సహకారం అందించడంలో నిట్‌ క్రియాశీల భూమిక పోషించిందన్నారు. అగ్ని, పృథ్వి, ఆకాశ్‌ వంటి క్షిపణులు, తేలికపాటి యుద్ధవిమానాలు, యుద్ధ ట్యాంక్‌ అర్జున్‌, రాకెట్‌ లాంచర్‌ పినాకలాంటి సాయుధ సంపత్తిని డీఆర్‌డీవోనే తయారు చేసిందన్నారు. వీటన్నింటి వల్లనే దేశ రక్షణ రంగం అత్యంత శక్తివంతమైందిగా నిలిచిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కొత్త అంశాలను నేర్చుకుంటూ ఉండాలని చెప్పారు. అంతకు ముందు కామత్‌ నిట్‌లో ఇన్‌స్టిట్యూట్‌ హెల్త్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ స్నాతకోత్సవానికి నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ అధ్యక్షత వహించారు. నిట్‌ సాధించిన ప్రగతిని వివరించారు. ఈ స్నాతకోత్సవంలో 1,875 మందికి డిగ్రీలను ప్రదానం చేశారు. ఇందులో 10మంది విద్యార్థులు బంగారు పతకాలను అందుకున్నారు. ఈ సారి నిట్‌ గోల్డ్‌ మెడల్‌ విజేతగా మంజిమా కర్మాకర్‌ (ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌) నిలిచారు.

Updated Date - Dec 01 , 2024 | 04:01 AM