Sridhar Babu: సహజ వనరుల రక్షణ కోసమే హైడ్రా
ABN , Publish Date - Aug 31 , 2024 | 03:50 AM
ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను రక్షించుకోలేక పోతే అది పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
జీరో కార్బన్ నగరంగా ఫ్యూచర్ సిటీ: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను రక్షించుకోలేక పోతే అది పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. నదులు, చెరువులు, వాగులు, అడవులు ప్రతిదీ మానవాళి మనుగడుకు అవసరమేనని పేర్కొన్నారు. ‘గృహ’ అనే పర్యావరణ సంస్థ శుక్రవారం ఇక్కడ నిర్వహించిన సదస్సులో శ్రీధర్‌బాబు ఈ మేరకు మాట్లాడారు.
చెరువులు, నీటి నాలాలు కాపాడేందుకే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని వివరించారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్ సిటీ అత్యాధునిక టెక్నాలజీతో కార్బన్ రహిత (జీరో కార్బన్) నగరంగా రూపొందుతుందని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించాల్సిందిగా మహేంద్రా వర్సిటీని కోరామని, ‘గృహ’ సంస్థ కూడా చేతులు కలిపి పర్యావరణ హిత నగరానికి దోహదపడాలని శ్రీధర్ బాబు కోరారు.
ఇదంతా కొత్త ఉద్యోగాల సృష్టికి, స్థిరమైన అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. కాగా నవోదయ విద్యాసమితి సంస్థలు రూపొందించిన ‘సస్టైనబుల్ ఇనిషియేటివ్స్’ అనే సంకలనాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్టు డైరెక్టర్ రాధాకృష్ణారెడ్డి, గృహ సంస్థ ప్రతినిధులు సంజయ్ సేథ్, షబనా బస్సీ తదితరులు పాల్గొన్నారు.