Share News

Mallanna Sagar: మల్లన్న సాగర్‌కు భూకంపం ముప్పు!

ABN , Publish Date - Jan 15 , 2024 | 09:02 AM

కాళేశ్వరంలో కీలక రిజర్వాయర్‌ అయిన మల్లన్నసాగర్‌ను నిర్మించిన ప్రాంతంలో.. భూకంపం ముప్పు ఉందని కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్‌జీఆర్‌ఐ చేసిన హెచ్చరికలను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై కాగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి అధ్యయనాలు జరపకుండానే, తొందరపాటుతో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని తెలిపింది.

 Mallanna Sagar: మల్లన్న సాగర్‌కు భూకంపం ముప్పు!

జలాశయం ప్రాంతంలో భూమి కింద నిట్టనిలువుగా భారీ చీలికలు

హెచ్చరించిన ఎన్‌జీఆర్‌ఐ.. బేఖాతరు చేసిన నాటి రాష్ట్ర ప్రభుత్వం

కాగ్‌ తాజా నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, జనవరి14(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరంలో కీలక రిజర్వాయర్‌ అయిన మల్లన్నసాగర్‌ను నిర్మించిన ప్రాంతంలో.. భూకంపం ముప్పు ఉందని కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్‌జీఆర్‌ఐ చేసిన హెచ్చరికలను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై కాగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి అధ్యయనాలు జరపకుండానే, తొందరపాటుతో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని తెలిపింది. భూకంపం వస్తే రిజర్వాయర్‌ సమీప ప్రాంతాల్లోని ప్రజల ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మూడేళ్లుగా సమగ్ర ఆడిట్‌ నిర్వహించిన కాగ్‌ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ముసాయిదా నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం..

మల్లన్న సాగర్‌ ప్రాథమిక డ్రాయింగ్స్‌ను 2016 ఆగస్టులో సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఆమోదించే సమయంలో.. సైట్‌లో భూకంపాలు సంభవించే అవకాశాలపై ఎన్‌జీఆర్‌ఐ వంటి సంస్థలతో అధ్యయనం జరిపించాలని సలహా ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌కు లేఖ రాయటంతో, అధ్యయనం చేసిన ఆ సంస్థ తన ప్రాథమిక నివేదికను మార్చి 2017లో సమర్పించింది. అయితే, ఈలోపే నీటిపారుదల శాఖ మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది.

తెలంగాణ భూకంపాల ప్రమాదం తక్కువగా ఉండే సీస్మిక్‌ జోన్‌-2లో ఉన్నప్పటికీ.. 1967లో కోయినాలో, 1993లో లాతూర్‌లో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపాల వల్ల సీస్మిక్‌ జోన్‌-2లోని దక్షిణాది ప్రాంతం కూడా భూకంపాలకు అతీతం కాదని అవగతమైంది. 1983లో మేడ్చల్‌ ప్రాంతంలో 4.9తీవ్రతతో వచ్చిన భూకంపం ప్రభావం 200 కి.మీ వరకు కనిపించింది. నాటి భూకంప కేంద్రం భూగర్భంలో 15 కి.మీ. దిగువన ఉండగా, అది ప్రస్తుతం మల్లన్నసాగర్‌ను కట్టిన ప్రాంతం నుంచి 20 కి.మీ. దూరంలోనే ఉంది.

మల్లన్న సాగర్‌ ప్రాంతం పరిధిలో సంభవించిన భూకంపాల చరిత్రను పరిగణలోకి తీసుకుంటే, 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే కట్టడాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా, భూకంపాలను తట్టుకునే విధంగా కట్టని(నాన్‌ ఇంజనీర్డ్‌) నిర్మాణాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ప్రతిపాదించిన ప్రాంతంలో భూగర్భం చాలా లోతు వరకు నిలువునా చీలి ఉన్నట్టు, కదలికలూ చోటుచేసుకుంటున్నట్టు ఎన్‌జీఆర్‌ఐ ప్రాథమిక నివేదిక స్పష్టం చేసింది. ఈ జోన్‌లోని రాళ్లు సైతం పగుళ్లు, కోతలకు గురైనవేనని తెలిపింది. కనీసం మూడు జతల భారీ చీలికలు(3 సెట్స్‌ ఆఫ్‌ డామినెంట్‌ లీనమెంట్‌) భూగర్భంలో ఉన్నట్టు ఎన్‌జీఆర్‌ఐ పేర్కొంది. ఈ పరిస్థితులు సృష్టించే సమస్యలపై సమగ్ర సర్వే, పరిశోధనలు చేయాలని ఎన్‌జీఆర్‌ఐ సిఫారసు చేసింది.

ఎన్‌జీఆర్‌ఐ నివేదికను, సిఫారసులను బేఖాతరు చేస్తూ ఎలాంటి సర్వేలు, అధ్యయనాలు చేపట్టకుండానే నిర్మాణం విషయంలో నీటిపారుదల శాఖ ముందుకు వెళ్లింది. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ దృఢత్వంపై, భూకంపం సంభవిస్తే కలిగే అపార నష్టంపై స్పష్టత లేకుండానే ఈ విధంగా వ్యవహరించటం తీవ్ర ఆందోళనకరం.

కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద జలాశయమైన మల్లన్నసాగర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. దీని కింద 10.3 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన మొత్తం ఆయకట్టులో సగానికి పైగా మల్లన్న సాగర్‌ కిందే ఉంది.

ముందే చెప్పాం.. అయినా వినలేదు

దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద లీనమెంట్‌ (భూగర్భంలో నిట్టనిలువునా పగళ్లు) మల్లన్న సాగర్‌ ప్రాంతంలో ఉందని, ఆ రిజర్వాయర్‌ నిర్మాణానికి ముందే ప్రభుత్వాన్ని టీజేఏసీ తరఫున హెచ్చరించాం. పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేశాం. ఈ ప్రాజెక్టు వద్ద ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. భూకంపం సంభవిస్తే మల్లన్న సాగర్‌ బద్దలై నీళ్లు పరుగులు తీస్తాయి. ఎగువ, మిడ్‌, లోయర్‌ మానేరు డ్యాములతో సహా గంటల వ్యవధిలో కరీంనగర్‌ పట్టణం గోదావరిలో కలిసిపోతుంది.

- కె.రఘు, చైర్మన్‌, తెలంగాణ జేఏసీ

Updated Date - Jan 15 , 2024 | 09:02 AM