Share News

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో రెండు చోట్ల ఈడీ సోదాలు

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:57 AM

సాహితీ ఇన్‌ఫ్రా మోసాలకు సంబంధించి ఈడీ అధికారులు హైదరాబాద్‌లో రెండుచోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.6.15 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో రెండు చోట్ల ఈడీ సోదాలు

  • రూ.6.15 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం

  • ఇప్పటి వరకు రూ.167.65 కోట్ల ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సాహితీ ఇన్‌ఫ్రా మోసాలకు సంబంధించి ఈడీ అధికారులు హైదరాబాద్‌లో రెండుచోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.6.15 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. సాహితీ ఇన్‌ఫ్రా కంపెనీతో భూముల క్రయవిక్రయాలకు సంబంధించి రూ.20 కోట్ల లావాదేవీలు నిర్వహించిన సీఎ్‌సకే రియల్టర్స్‌, సింగ్‌ మాన్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ డైరెక్టర్లు సురేష్‌ కుమార్‌ అగర్వాల్‌, రక్షిత్‌ అగర్వాల్‌లకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. బషీర్‌బాగ్‌, ఆదర్శనగర్‌లో జరిపిన సోదాల్లో రూ.5.42 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు, రూ.72.75లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.


ప్రీలాంచ్‌ ఆఫర్ల ద్వారా వేలాది మంది కొనుగోలుదారుల నుంచి రూ.842.15 కోట్లు సాహితీ ఇన్‌ఫ్రా సేకరించింది. ఇందులో రూ.216.91కోట్లను ఎక్కడా లెక్కల్లో చూపకుండా డైరెక్టర్లు, లక్ష్మీనారాయణ కలిసి సొంతానికి వాడుకున్నట్టు ఈడీ విచారణలో వెల్లడైంది. సురేష్‌ కుమార్‌ అగర్వాల్‌కు చెందిన రెండు కంపెనీలతో 20 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో సురేష్‌ కుమార్‌ అగర్వాల్‌కు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సురేష్‌ కుమార్‌ అగర్వాల్‌ ఖాతరు చేయకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో సోదాలు నిర్వహించామని, త్వరలో మరోసారి నోటీసులు జారీ చేస్తామని హైదరాబాద్‌ ఈడీ అధికారులు తెలిపారు. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఇప్పటి వరకు ఈడీ అధికారులు రూ.161.15కోట్ల ఆస్తులను అటాచ్‌ చేశారు. తాజా దాడులతో అటాచ్‌ చేసిన ఆస్తుల విలువ రూ.167.65 కోట్లకు చేరిందని ఈడీ అధికారులు తెలిపారు.

Updated Date - Dec 21 , 2024 | 04:57 AM