Share News

Amoy Kumar: అసలైన వారిని వదిలి.. బినామీలకు నోటీసులు!

ABN , Publish Date - Dec 02 , 2024 | 04:25 AM

రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అమోయ్‌ కుమార్‌పై విచారణ తప్పుదోవ పడుతోందా? ఆయనకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) అధికారులు కొందరు సహకరిస్తున్నారా?

Amoy Kumar: అసలైన వారిని వదిలి.. బినామీలకు నోటీసులు!

  • ఐఏఎస్‌ అమోయ్‌కుమార్‌ కేసు విచారణ తప్పుదోవ?

  • భూముల బదిలీ కేసులో సీసీఎల్‌ఏకు ఫిర్యాదు

హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అమోయ్‌ కుమార్‌పై విచారణ తప్పుదోవ పడుతోందా? ఆయనకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) అధికారులు కొందరు సహకరిస్తున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. భూముల బదిలీ కేసులో అసలైన వారికి కాకుండా బినామీలకు నోటీసులు జారీ చేశారన్న ఆరోపణలున్నాయి. ఆదిభట్లలోని సర్వే నంబరు 44లో 10ఎకరాల పట్టా భూములను అక్రమంగా గోపాల్‌ గౌడ్‌, మంజుల గౌడ్‌కు బదిలీ చేసిన విషయంలో అమోయ్‌ కుమార్‌ ప్రమేయంపై ఈడీ విచారణ చేపట్టింది. ఈ విషయంలో సీసీఎల్‌ఏ కూడా సమాంతర విచారణ జరుపుతోంది.


ఈ పదెకరాలకు హక్కుదారులమైన తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, విచారణకు పిలవకుండా.. అధికారులు ఇతరులకు నోటీసులిచ్చారని, దీనిపై విచారణ జరపాలంటూ నీరుడి యాదయ్య తదితరులు సీసీఎల్‌ఏకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలో సీసీఎల్‌ఏ నోటీసులు అందుకున్న వారు బినామీలని ఆదిభట్ల వాసులు ఆరోపిస్తున్నారు. కాగా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో రూ.100 కోట్ల విలువైన భూముల అక్రమ బదిలీకి సంబంధించిన కేసులో నెలన్నర క్రితం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అమోయ్‌ కుమార్‌ను విచారించారు. ఈ కేసులో సీసీఎల్‌ఏ అధికారులూ విచారణ చేపట్టారు. విచారణను తప్పుదోవ పట్టించేలా సీసీఎల్‌ఏలోని కొందరు అధికారులు అమోయ్‌ కుమార్‌కు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై సీసీఎల్‌ఏకు ఫిర్యాదు అందింది.

Updated Date - Dec 02 , 2024 | 04:25 AM