Rains: వర్షాలపై విద్యాశాఖ అలర్ట్.. పాఠశాలలకు సెలవు
ABN , Publish Date - Aug 20 , 2024 | 08:07 AM
గ్రేటర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై విద్యాశాఖ అలర్ట్ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలలకు డీఈవో సెలవు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావం బీభత్సంగానే ఉంది.
హైదరాబాద్: గ్రేటర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై విద్యాశాఖ అలర్ట్ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలలకు డీఈవో సెలవు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావం బీభత్సంగానే ఉంది. పరిస్థితిని బట్టి స్కూళ్ల యాజమాన్యాలు సెలవు ప్రకటించాలని డీఈవో.. ఎంఈవోలకు పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
వర్షానికి కొట్టుకుపోయి వ్యక్తి మృతి..
ముషీరాబాద్ వినోబా నగర్ ప్రేయర్ పవర్ చర్చి దగ్గర నివాసముండే విజయ్ (43) అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంలో వరద నీటిలో కొట్టుకుపోయి చనిపోయాడు. ఆదర్శ కాలనీ వద్ద అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, లాలాపేట్‌లో భారీ వర్షం కురుస్తోంది.
కుండపోత వర్షం..
హైదరాబాద్‌లో నిన్నటి నుంచి వర్షం బీభత్సంగా కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనుల నిమిత్తం కూడా బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఈ క్రమంలోనే భాగ్యనగరానికి జీహెచ్ఎంసీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షానికి ఎక్కడికక్కడ వృక్షాలు నేలమట్టమవుతున్నాయి. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడుతున్నాయి. జంట నగరాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. కాగా, హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
అంధకారంలో భాగ్యనగరం..
సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. జంట నగరాల్లో ఇక్కడ అక్కడ అని లేకుండా మొత్తంగా కుంభవృష్టి కురిసింది. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయి చెరువులను తలపించాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వాహనాలతో పాటు మనుషులు సైతం కొట్టుకుపోయారు. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో భాగ్యనగరం అంధకారంలో నెలకొంది. కరెంటు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరించింది. ఈరోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.