Share News

Education Department : ‘ప్రియమైన తోటి విద్యార్థులారా!’

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:28 AM

ప్రియమైన నా తోటి విద్యార్థులకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నమస్కారం.. లాంటి మాటలు చెబుతూ ప్రసంగాలివ్వడం అందరివల్లా కాదు. ఉపన్యాసం సంగతి అటుంచితే వేదికను చూస్తేనే చాలామంది వణికిపోతారు.

Education Department : ‘ప్రియమైన తోటి విద్యార్థులారా!’

  • నాయకత్వ లక్షణాలపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు శిక్షణ

  • ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో ప్రత్యేక ప్రసంగాలు

  • ప్రతి రోజు యోగా, ధ్యానం తరగతులు

  • విద్యా శాఖ కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రియమైన నా తోటి విద్యార్థులకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నమస్కారం.. లాంటి మాటలు చెబుతూ ప్రసంగాలివ్వడం అందరివల్లా కాదు. ఉపన్యాసం సంగతి అటుంచితే వేదికను చూస్తేనే చాలామంది వణికిపోతారు. ఈ భయం అన్ని వయస్సుల వారిలో ఉంటుంది. అయితే, ఈ భయాన్ని పోగొట్టి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యార్థుల్లో ఉండే భయాలను పోగొట్టేందుకు ప్రసంగాలు ఇవ్వడంపై సాధన చేయించాలని నిర్ణయించింది. అలాగే, మనసు, శరీరాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు వీలుగా విద్యార్థులకు యోగా, ధ్యానంలో శిక్షణ ఇప్పించనుంది. ఈ ఏడాది నుంచే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఇందులో కొన్ని కార్యక్రమాలను అకడమిక్‌ క్యాలెండర్‌లో ఇప్పటికే పొందుపరిచారు.


మిగిలిన కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభించనున్నారు. అకడిమక్‌ క్యాలెండర్‌ ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీ రోజు ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం తరగుతులు నిర్వహిస్తారు. స్కూల్‌ అసెంబ్లీ పూర్తయిన తర్వాత విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లిన వెంటనే ఇవి జరుగుతాయి. ఇక, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే లక్ష్యంగా ప్రతీ రోజు పాఠశాల పరిధిలో విద్యార్థుల మధ్య ప్రసంగాల పోటీని నిర్వహించనున్నారు. తరగతులు, పాఠశాలల వారీగా ఈ పోటీలు ఉంటాయి. ఈ పోటీలను జిల్లాస్థాయిలో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా విద్యా శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక, కో-కరికులర్‌ సబ్జెక్టు పరిధిలో ఫిజికల్‌ అండ్‌ మెంటల్‌ ఎడ్యుకేషన్‌, న్యూట్రీషన్‌ అండ్‌ సేప్టీ, ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ అంశాల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 14 తరగతులు, ప్రాథమికోన్నత విద్యార్థులకు 9, ఉన్నతపాఠశాల విద్యార్థులకు ఎనిమిది తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు నెలలో ప్రతీ మూడో శనివారాన్ని నోబ్యాగ్‌ డేగా పాటించనున్నారు. సాంకేతికతకు అందిపుచ్చుకునేందుకు వీలుగా డిజిటల్‌ తరగతులను కూడా నిర్వహించాలని నిర్ణయించారు.

Updated Date - Jun 26 , 2024 | 07:41 AM