Share News

Hyderabad: విఘ్ననాయకుడికి వీడ్కోలు నేడు

ABN , Publish Date - Sep 17 , 2024 | 02:51 AM

ఖైరతాబాద్‌లో కొలువైన మహా గణపతి నుంచి.. గల్లీల్లోని గణనాథుల వరకు మంగళవారం నిమజ్జనానికి కదలనున్నారు.

Hyderabad: విఘ్ననాయకుడికి వీడ్కోలు నేడు

  • గ్రేటర్‌లో 73 ప్రాంతాల్లో నిమజ్జనం

  • విధుల్లో 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది

  • 35 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 16(ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్‌లో కొలువైన మహా గణపతి నుంచి.. గల్లీల్లోని గణనాథుల వరకు మంగళవారం నిమజ్జనానికి కదలనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్‌ సాగర్‌తో పాటు సరూర్‌నగర్‌, కాప్రా తదితర ప్రాంతాల్లోని పెద్ద, చిన్న చెరువులు, పోర్టబుల్‌ పాండ్స్‌తో కలిపి 73 ప్రాంతాల్లో నిమజ్జనం చేయనున్నారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ, ఇతర పనులకు 160 గణేష్‌ యాక్షన్‌ టీంలను జీహెచ్‌ఎంసీ రంగంలోకి దింపింది. వివిధ విభాగాలకు చెందిన 15 వేల మంది సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. హైదరాబాద్‌ సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 35 వేల మందిపైగా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. హుస్సేన్‌సాగర్‌ తీరంలోనే 3 వేల మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని పోలీస్‌ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.


శోభాయాత్ర మార్గాల్లో విద్యుత్తు లైన్లు అడ్డు రాకుండా, సరఫరాలో అంతరాయం కలిగితే తక్షణమే పునరుద్ధరించేలా టీజీఎ్‌సపీడీసీఎల్‌ సిబ్బందిని రంగంలోకి దింపింది. ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌ వద్ద 8, పెద్ద చెరువుల వద్ద మొబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఉంచారు. ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో మరుగుదొడ్లు, వాటర్‌ క్యాంప్‌లు, వైద్య శిబిరాలు, కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ తీరం వరకు 18 కి.మీ. మేర ప్రధాన శోభాయాత్ర సాగనుంది. వేర్వేరు ప్రాంతాల నుంచి గణనాఽథుల ఊరేగింపు జరిగే మార్గాలు 300 కి.మీ. పైగా ఉన్నాయి.


పారిశుధ్య నిర్వహణకు 3, 4 కి.మీలకు ఒకటి చొప్పున గణేష్‌ యాక్షన్‌ టీంలు ఉంటాయి. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా, సంజీవయ్య పార్కు, బేబి పాండ్‌ల వద్ద 38 క్రేన్లు ఉన్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి తెలిపారు. నిమజ్జన ప్రక్రియకు ఆటంకం లేకుండా సాగర్‌ తీరం చుట్టూ పోలీసులు బారికేడ్లు పెట్టారు. అదనంగా 733 సీసీ కెమెరాలు బిగించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ప్రత్యేక ఐటీ బృందం శోభాయాత్రను పర్యవేక్షించనుంది. నిమజ్జన ఊరేగింపులో రంగురంగుల పేపర్లు చల్లొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కోరారు.

Updated Date - Sep 17 , 2024 | 05:18 AM