Justice Narsimhareddy: విద్యుత్‌కమిషన్ గడువు పెంచారా? లేదా?
ABN , Publish Date - Jul 02 , 2024 | 04:33 AM
విద్యుత్ విచారణ కమిషన్ గడువు పెంచారా? లేదా? గడువును పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయా? లేవా? అని.. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి సోమవారం ఆరా తీసినట్లు సమాచారం.
కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ఆరా
30తోముగిసిన గడువు.. పెంపుపై నేడో రేపో ఉత్తర్వులు!
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ విచారణ కమిషన్ గడువు పెంచారా? లేదా? గడువును పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయా? లేవా? అని.. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి సోమవారం ఆరా తీసినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఛత్తీ్‌సగఢ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లను నామినేషన్ ప్రాతిపదికన అప్పగించడంపై జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 7న విచారణ ప్రారంభించిన కమిషన్ జూన్ 30లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంది. కాళేశ్వరం కమిషన్‌కు కూడా గడువు జూన్ 30 దాకానే ఉండగా.. దాన్ని ఆగస్టు 31 దాకా (రెండునెలలు) పెంచుతూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. విద్యుత్ కమిషన్ విషయానికి వస్తే.. విచారణ ప్రక్రియ కీలక దశలో ఉంది.
అదిపూర్తి కావడానికి మరో రెండునెలలైనా పట్టే అవకాశాలున్నాయి. మరోవైపు.. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎస్‌ఏఎం రిజ్వీని ప్రభుత్వం ఇటీవలే బదిలీ చేసింది. ఆయన స్థానంలో రోనాల్డ్‌రా్‌సను నియమించింది. ఇంధన శాఖతో పాటు జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. గత పదేళ్లకాలంలో ఇంధన శాఖలో నియమితులైన అధికారుల్లో ఈయనే జూనియర్. ఆయన బాధ్యతలు స్వీకరించి శాఖపై అధ్యయనం చేస్తున్న క్రమంలోనే కమిషన్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో.. విద్యుత్ విచారణ కమిషన్ గడువు పెంపుపై మంగళ, బుధవారాల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం.