High Court: పెంచుకుంటున్నవారికే దత్తత ఇవ్వొచ్చు కదా?
ABN , Publish Date - Dec 01 , 2024 | 04:43 AM
పిల్లలకు ప్రేమ పంచడానికి కన్న తల్లిదండ్రులే కావాలా? అక్కున చేర్చుకొని, గోరుముద్దలు తినిపించి.. ఏడిస్తే లాలించి ఓదార్చేవారినెవర్నయినా చిన్నారులు తమ కన్నవారిగానే భావిస్తారు.
ఇందుకు చట్టబద్ధంగా ఉన్న అవకాశాలను పరిశీలించండి
పెంపుడు తల్లిదండ్రులు చేసుకున్న అర్జీలపై నిర్ణయం చెప్పండి: హైకోర్టు
15 మంది చిన్నారుల విషయంలో శిశు సంరక్షణ కమిటీకి కోర్టు ఆదేశం
పిల్లల్ని బలవంతంగా స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదని వ్యాఖ్య
చిన్నారులను తీసుకోవడానికి రక్తం పంచిన తల్లిదండ్రులు ముందుకురాలేదు..
ఈ విషయాన్ని శిశు సంరక్షణ కమిటీ పరిగణనలోకే తీసుకోలేదని ఆక్షేపణ
హైదరాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు ప్రేమ పంచడానికి కన్న తల్లిదండ్రులే కావాలా? అక్కున చేర్చుకొని, గోరుముద్దలు తినిపించి.. ఏడిస్తే లాలించి ఓదార్చేవారినెవర్నయినా చిన్నారులు తమ కన్నవారిగానే భావిస్తారు. కొన్నాళ్లకు వారి ఎడబాటును ఆ చిన్నారులు గానీ, ఆ చిన్నారుల ఎడబాటును పెంచినవారు గానీ భరించలేరు. చట్టబద్ధమైన దత్తత కాదంటూ పిల్లలను పెంచుకుంటున్న తల్లిదండ్రుల నుంచి లాగేసుకొని.. దూరంచేస్తే అది ఆ చిన్నారులకు, పెంచుకున్నవారికీ గుండెకోత కాకపోతే మరేమిటి? తమవారు కనిపించకపోవడంతో పొద్దస్తమానం ఏడుస్తూ గడుపుతున్న ఆ చిన్నారులను కన్నవారైనా దయతలిచి అక్కున చేర్చుకుంటే కొన్నిరోజులకు ఆ పసిగుడ్లు పెంపుడు తల్లిదండ్రులను మరిచిపోయేవారేమో! అయితే పేగు తెంచుకొని పుట్టారన్న మమకారం కూడా లేకుండా చిన్నారులను తీసుకునేందుకు ఆ తల్లిదండ్రులు తిరస్కరించారు. మరి.. ఆ చిన్నారుల పరిస్థితి ఏమిటిప్పుడు? ఇదంతా కూడా అక్రమ మార్గంలో పిల్లలను కొనుగోలు చేశారనే ఆరోపణల మీద ఆర్నెల్ల క్రితం పెంపుడు తల్లిదండ్రుల నుంచి దూరం చేసి.. శిశు సంరక్షణ కమిటీ సంరక్షణలో ఉంచిన 15 మంది పిల్లల గురించే! పిల్లలు దూరమై కంటికి మంటికీ ధారగా రోదిస్తున్న ఆ తల్లిదండ్రులకు, శిశు గృహాల్లో మగ్గిపోతున్న పసికూనలకు ఊరట కలిగించేలా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
పెంపుడు తల్లిదండ్రులు ఆ పిల్లలను కొనుగోలు చేసిన విషయం వాస్తవమే అయినా వారికే ఆ చిన్నారులను దత్తత ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని.. ఆ మేరకు వారు ఇప్పటికే చేసుకున్న దరఖాస్తులపై నాలుగు వారాల్లోగా ఓ నిర్ణయం తీసుకోవాలంటూ శిశు సంరక్షణ కమిటీకి హైకోర్టు ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే.. రాచకొండ మేడిపల్లి పోలీ్‌సస్టేషన్ పరిధిలో ఫీర్జాదిగూడ రామకృష్ణ నగర్ కాలనీలో శోభారాణి అనే మహిళ ఓ క్లినిక్‌ను నిర్వహిస్తోంది. సదరు క్లినిక్ ముసుగులో చిన్నపిల్లలను సంతానం లేని దంపతులకు ఆమె విక్రయిస్తోందనే సమాచారం రావడంతో కొందరు విలేకరులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహిచారు. నెలలు కూడా నిండని ఆడపిల్లను రూ.5 లక్షలు, మగపిల్లలను రూ.6 లక్షల ధర నుంచి ఆమె బేరంపెట్టినట్లు తేలింది. విలేకరులు ఆ క్లినిక్‌కు వెళ్లి ఓ ఆడ శిశువును తీసుకుంటామని చెప్పి రూ.4.5 లక్షలకు బేరం కుదుర్చుకుని.. కొందరు పిల్లల ఫొటోలను తీసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా మేడిపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దత్తత నిబంధనలేమీ పాటించకుండా, విక్రయించారనే ఆరోపణలతో గత మే నెల 22వ తేదీన 15 మంది చిన్నారులను స్వాధీనం చేసుకొని శిశు సంరక్షణ కమిటీకి అప్పగించారు. అయితే ఆ పిల్లలను ప్రాణప్రదంగా చూసుకుంటున్న ఆ పెంపుడు తల్లిదండ్రులు హైకోర్టులో తొమ్మిది వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
పిల్లలను లాక్కునే అధికారం పోలీసులకెక్కడిది?
పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం.. చిన్నారులను బలవంతంగా స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదని స్పష్టంచేసింది. అక్రమంగా దత్తత తీసుకున్న తల్లిదండ్రులు చట్టప్రకారం అడాప్షన్ డీడ్స్ ఎగ్జిక్యూట్ చేయడం లేదా చట్టంలో అనుమతించిన విధంగా హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత హోమం ద్వారా దత్తత తీసుకొని పిల్లలను తమ వద్దే ఉంచుకోవచ్చునని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ను చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్టు డైరెక్టర్, డివిజన్ బెంచ్‌లో రిట్ అప్పీళ్ల ద్వారా సవాల్ చేశారు. ఈ రిట్ అప్పీళ్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం సమగ్రంగా విచారించింది. జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ - 2015 పేర్కొన్న ప్రక్రియపై చర్చించింది. ‘ప్రస్తుత కేసులో పిల్లలను వారి కన్న తల్లిదండ్రులు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పిల్లలను అప్పగించిన తర్వాత చట్టప్రకారం సదరు పిల్లలకు కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరమా? ఎలాంటి అడ్డంకులు లేకుండా న్యాయపరంగా దత్తత ఇవ్వడానికి కన్నవారు సిద్ధంగా ఉన్నారా? అనే అంశాలపై కమిటీ విచారణ నిర్వహించలేదు. చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తిచేయలేదు. మే నెల 22 నుంచి పిల్లలు కమిటీ కస్టడీలోనే ఉంటున్నారు. ప్రస్తుతం సదరు కస్టడీలో మేం జోక్యం చేసుకోవడం లేదు. చట్టప్రకారం అన్ని విచారణలు పూర్తిచేసి.. దత్తత తల్లిదండ్రులకు మళ్లీ చట్టప్రకారం దత్తత ఇచ్చే అంశంపై నాలుగువారాల్లో కమిటీ నిర్ణయం తీసుకోవాలి ’ అని ధర్మాసం పేర్కొంది.