Lagacherla: ఉద్యోగులపై దాడి దుర్మార్గం
ABN , Publish Date - Nov 15 , 2024 | 03:18 AM
లగచర్ల ఘటనలో ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు సేవ చేసే ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సంఘాల ఆందోళన
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): లగచర్ల ఘటనలో ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు సేవ చేసే ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నాయి. దాడికి పాల్పడిన వారిని, ప్రోత్సహించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. రాజకీయ లక్ష్యాల కోసం ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగడం దుర్మార్గమని తెలంగాణ గెజిటెడ్, ఉద్యోగ, ఉపాధ్యాయ, నాలుగోతరగతి, కార్మికులు, ఫించన్‌దారుల ఐకాస ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.
దాడికి నిరసనగా ఐకాస, ట్రెసా ప్రతినిధులు ప్రధాన భూపరిపాలనా కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇక, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్, ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ మాట్లాడుతూ వికారాబాద్ ఘటన ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం రెవెన్యూ ఉద్యోగులు చరిత్రలో వేల ఎకరాల భూసేకరణను ప్రశాంతంగా చేపట్టారన్నారు. లగచర్లలో రైతుల ముసుగులో గూండాలు దాడి చేశారన్నారు. ఆందోళనల్లో టీజీవో వైస్ ప్రెసిడెంట్ బి.శ్యామ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాలో వి.లచ్చిరెడ్డి నేతృత్వంలోని ఐకాస ప్రతినిధులు పాల్గొన్నారు.