Share News

Nizamabad: కుటుంబాన్ని బలిగొన్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

ABN , Publish Date - Oct 06 , 2024 | 04:15 AM

ఓ యువకుడి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మోజు ఏకంగా కుటుంబాన్నే బలి తీసుకుంది. బెట్టింగుల్లో కొడుకు చేసిన అప్పులు తీర్చలేక.. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక అతనితో పాటు తల్లిదండ్రులూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Nizamabad: కుటుంబాన్ని బలిగొన్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

  • మిగిలిన రూ.7 లక్షలు, స్థలం తాకట్టు పెట్టి తెచ్చిన 6 లక్షలు కొడుకు ఖాతాలో..

  • ఈ డబ్బుతో పాటు మరో 7 లక్షలు అప్పుచేసి మళ్లీ బెట్టింగుల్లో పోగొట్టిన కొడుకు

  • తీర్చే మార్గం లేక.. ఒత్తిళ్లు తట్టుకోలేక తల్లిదండ్రులు, కొడుకు ఆత్మహత్య

  • నిజామాబాద్‌ జిల్లాలో విషాద ఘటన

ఎడపల్లి, అక్టోబరు 5: ఓ యువకుడి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మోజు ఏకంగా కుటుంబాన్నే బలి తీసుకుంది. బెట్టింగుల్లో కొడుకు చేసిన అప్పులు తీర్చలేక.. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక అతనితో పాటు తల్లిదండ్రులూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్‌ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. ఎడపల్లి మండలం వడ్డాపల్లి గ్రామానికి చెందిన రంగనవేని సురేష్‌ (53) కిరాణ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య హేమలత (48), కుమారుడు హరీష్‌ (25) ఉన్నారు. హరీష్‌ మధ్యలోనే చదువు మానేసి.. జులాయిగా తిరుగుతుండేవాడు. కరోనా సమయం నుంచి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు.


దీని కోసం మొదట తెలిసిన వ్యక్తుల వద్ద రూ.5 లక్షలు అప్పు చేశాడు. చెప్పిన సమయానికి బాకీ తీర్చకపోవడంతో అప్పు ఇచ్చినవారు ఇంటికొచ్చి గొడవ చేశారు. దీంతో సురేష్‌ తనకున్న అర ఎకరం పొలాన్ని ఏడాది క్రితం రూ.12 లక్షలకు విక్రయించి కొడుకు చేసిన రూ.5 లక్షల అప్పు తీర్చాడు. మిగిలిన డబ్బుతో ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. సురేష్‌కు బ్యాంకు లావాదేవీలపై అవగాహన లేకపోవడంతో మిగిలిన రూ.7 లక్షలను కొడుకు ఖాతాలో వేశాడు. ఇంటి నిర్మాణానికి ఆ డబ్బు కూడా సరిపోదని తనకున్న ఇంటి స్థలాన్ని తాకట్టు పెట్టి ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ నుంచి మరో రూ.6 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బులను సైతం కొడుకు ఖాతాలోనే వేశాడు. అయితే బెట్టింగ్‌ వ్యసనాన్ని వీడని హరీష్‌.. తండ్రి తన ఖాతాలో ఉంచిన రూ.13 లక్షలతో పాటు మరికొందరు వ్యాపారుల వద్ద కూడా రూ.లక్షల్లో అప్పు చేసి బెట్టింగుల్లో పెట్టాడు.


ఈ డబ్బంతా బెట్టింగుల్లో పోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఇదే సమయంలో అతనికి అప్పులిచ్చిన వ్యాపారులు సురేష్‌ తన ఇంటి స్థలాన్ని ఫైనాన్స్‌ సంస్థకు తాకట్టు పెట్టిన విషయాన్ని తెలుసుకుని శుక్రవారం రాత్రి అతని ఇంటికి పెద్దసంఖ్యలో వచ్చారు. వెంటనే తమ బాకీ తీర్చాలని పట్టుబట్టారు. అప్పటి వరకు కొడుకు హరీష్‌ మళ్లీ అప్పులు చేసిన విషయం సురేష్‌కు తెలియదు. సుమారు రూ.20 లక్షల వరకు బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్టు కొడుకు చెప్పడంతో హతాశుడయ్యాడు. ఏం చేయాలో తెలియక గుండెలవిసేలా రోదించాడు. వారం రోజుల్లో కొడుకు చేసిన అప్పులు తాను తీరుస్తానని అప్పులిచ్చిన వారికి చెప్పి పంపించాడు. ఒకవైపు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం.. ఇంటి నిర్మాణం ఆగిపోవడం.. ఇంకోవైపు అప్పులిచ్చిన వారి ఒత్తిడితో తీవ్ర మనస్థాపానికి గురైన సురేష్‌, హేమలత దంపతులు, వారి కొడుకు హరీష్‌ శుక్రవారం అర్ధరాత్రి తమ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Oct 06 , 2024 | 04:15 AM