Tirumala: దేవుడి ముందు దర్పం!
ABN , Publish Date - Aug 24 , 2024 | 03:59 AM
భగవంతుని దర్శనానికి ఎంత ప్రముఖులైనా సామాన్య భక్తుల్లా వెళ్లడం ఆనవాయితీ.
25 కిలోల బంగారు ఆభరణాలతో శ్రీవారి దర్శనానికి
తిరుమల, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): భగవంతుని దర్శనానికి ఎంత ప్రముఖులైనా సామాన్య భక్తుల్లా వెళ్లడం ఆనవాయితీ. అన్యధా శరణం నాస్తి అంటూ వేడుకోవడం పరిపాటి. అయితే కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి ఓ కుటుంబం మెడ, చేతులు, వేళ్ల నిండా బంగారు గొలుసులు, చైన్లు, కవచాలు, ఉంగరాలు ధరించి ఆడంబరంగా వచ్చింది.
పుణెకు చెందిన సన్నీ నానాసాహెబ్ వాఘ్‌చౌరే, సంజయ్ దత్తత్రేయ గుజర్, ప్రీతి సోనీ సుమారు 25 కిలోల బంగారు ఆభరణాలను ధరించి, స్టైలిష్ కళ్లజోళ్లు పెట్టుకుని శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దాదాపు రూ.15 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ధరించిన వీరి కుటుంబానికి రక్షణగా 15 మంది సెక్యూరిటీ సిబ్బంది వచ్చారు. వీరు ప్రయాణించిన కారు కూడా బంగారు రంగులోనే ఉంటడం విశేషం.