Father: కుమార్తెకు న్యాయం జరగడం లేదని వ్యవసాయ బావిలో దూకిన తండ్రి
ABN , Publish Date - Sep 24 , 2024 | 03:56 AM
అత్తింటి వేధింపులను తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన తన కూతురుకు న్యాయం చేయాలని వేడుకున్నా, పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో ఓ తండ్రి పాడుబడ్డ వ్యవసాయ బావిలో దూకాడు.
అత్తింటివారి వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన
ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుల సంఘం వాట్సాప్ గ్రూప్‌లో సందేశం.. సిరిసిల్ల జిల్లాలో ఘటన
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 23: అత్తింటి వేధింపులను తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన తన కూతురుకు న్యాయం చేయాలని వేడుకున్నా, పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో ఓ తండ్రి పాడుబడ్డ వ్యవసాయ బావిలో దూకాడు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చెందిన అగుళ్ల శ్రీనివాస్(48) కూతురు రమ్యకు పదేళ్ల క్రితం సిరిసిల్లలోని రాజీవ్‌నగర్‌కు చెందిన మిట్లపల్లి శ్రీకాంత్‌తో పెళ్లయింది. అత్తింటివారి వేధింపులతో ఐదు రోజుల క్రితం రమ్య ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స చేయించిన తండ్రి శ్రీనివాస్, కోలుకున్నాక రాచర్లబొప్పాపూర్‌కు తీసుకొచ్చాడు.
తన కుమార్తెను అత్తింటి వారు వేధిస్తున్నారని శనివారం ఎల్లారెడ్డిపేట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోవడం లేదని, ఫిర్యాదు చేసి రెండ్రోజులు గడిచినా కూతురు అత్తింటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని కుటుంబసభ్యులతో చెప్పి మనస్తాపం చెందాడు. తన కూతురికి ఇక న్యాయం జరగదని, కూతురును వేధిస్తున్న అత్తింటివారి వల్లే తాను బావిలో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కుల సంఘానికి సంబంధించిన వాట్సప్ గ్రూప్‌లో పోస్టు పెట్టాడు. అనంతరం ఇంటి సమీపంలో ఉన్న పాడుబడ్డ వ్యవసాయ బావిలో దూకాడు. సమాచారం అందుకున్న ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలోని పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు. బావిలో నీటిని తొలగించారు. అయితే శ్రీనివాస్ ఆచూకీ లభించలేదు.