Supreme Court: 211 రోజులుగా జైల్లో ఉంటున్నా.. బెయిలివ్వండి
ABN , Publish Date - Oct 25 , 2024 | 04:24 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఏఎస్పీ మేకల తిరుపతన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంలో ఫోన్‌ట్యాపింగ్ నిందితుడు తిరుపతన్న పిటిషన్
న్యూఢిల్లీ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఏఎస్పీ మేకల తిరుపతన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 211 రోజులుగా జైలులో ఉంటున్నానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, న్యాయవాది మోహిత్ రావు వాదనలు వినిపించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ తిరుపతన్న, భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును ఈఏడాది మార్చి 23న అరెస్టు చేశారు.
అప్పటి నుంచి దాదాపు 211 రోజులుగా తిరుపతన్న జైలులోనే ఉన్నారు’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ధర్మాసనం జోక్యం చేసుకుని 211 రోజులుగా జైల్లో ఉంచడానికి నిందితుడు చేసిన నేరం ఏంటని ప్రశ్నించింది. న్యాయవాది మోహిత్ రావు సమాధానమిస్తూ.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఏఎస్పీగా ఉన్న తిరుపతన్న అవసరాన్ని బట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేసేవారని తెలిపారు. ధర్మాసనం మరోసారి కలుగజేసుకుని.. నిందితుడు చేసిన నేరమేమిటో తమకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. ఇందులో ప్రభుత్వ వాదనలు సైతం వినాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.