Share News

Venkaiah Naidu: అందుకే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు..!

ABN , Publish Date - Feb 04 , 2024 | 04:35 PM

శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..

Venkaiah Naidu: అందుకే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు..!

హైదరాబాద్: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ఐదుగురు కళాకారులకు కూడా పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య, చిరును రేవంత్ ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ప్రతిభ ఉన్న వారిని గుర్తించి.. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను అందించడం ఒక ఎత్తు అయితే.. అలాంటి పురస్కారాలు అందుకున్న తెలుగు వారిని సన్మానించాలనే నిర్ణయం తీసుకోవడం మంచి సాంప్రదాయమని అన్నారు.

venklayya.jpg

రేవంత్, చిరు గురించి వెంకయ్య మాటల్లో..

‘‘ఇలాంటి మంచి సాంప్రదాయానికి నాంది పలికిన సీఎం రేవంత్ రెడ్డిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. రేవంత్.. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చైతన్య శీలి, ఉత్సాహవంతుడైన యువకుడు. అలాంటి వారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఆయన హయాంలో మరిన్ని మంచి పనులు జరగడంతో పాటు తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి రేవంత్ కృషి చేస్తారనే నమ్మకం నాకు ఉంది. చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు అందించడం సంతోషకరం. మట్టిలో మాణిక్యాలను బయటికి తీసిన చందంగా.. ఇక్కడున్న మహానుభావులను గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ.. అవార్డులు ప్రకటించడం మంచి సాంప్రదాయం. ఇటీవల పార్లమెంట్‌, అసెంబ్లీల్లో ఘటనలు బాధాకరం. రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. బూతుల నేతలకు పోలింగ్ బూత్‌లో సమాధానం చెప్పాలి. నీతి, నిజాయితీలేని వారికి గుణపాఠం చెప్పాలి. కొందరు నేతలు నాలుగు 'సి' నమ్ముకుంటున్నారు. కొందరు క్యాస్ట్‌, క్యాష్‌, కమ్యూనిటీ, క్రిమినాలిటీని నమ్ముకుంటున్నారు. ప్రజా జీవనంలో ఉన్న వ్యక్తులు విలువలు పాటించాలి. ఇష్టపడిన శ్రమను కష్టపడి పనిచేస్తే నష్టపోయేది ఏదీ లేదు. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధ్యమే’’.. అని వెంకయ్య పేర్కొన్నారు.

venkayya-revanth-reddy.jpg

Updated Date - Feb 04 , 2024 | 04:54 PM