Police Arrests: లగచర్ల ఘటన.. 25కు చేరిన అరెస్టులు
ABN , Publish Date - Nov 17 , 2024 | 03:42 AM
లగచర్ల ఫార్మావిలేజ్ ఘటనలో పోలీసులు శనివారం మరో నలుగురిని అరెస్టు చేశారు. పరిగి ఠాణా నుంచి వారిని తరలించి.. కొడంగల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
మరో నలుగురికి జ్యుడీషియల్ రిమాండ్
వికారాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): లగచర్ల ఫార్మావిలేజ్ ఘటనలో పోలీసులు శనివారం మరో నలుగురిని అరెస్టు చేశారు. పరిగి ఠాణా నుంచి వారిని తరలించి.. కొడంగల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా.. జడ్జి వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో.. ఇప్పటి వరకు రిమాండ్ అయిన వారి సంఖ్య 25కు చేరుకుంది. ఈ కేసులో ఇంకా 22 మంది అరెస్టు కావాల్సి ఉండగా.. కీలక నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
వికారాబాద్‌కు మహేశ్ భగవత్
లగచర్ల కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్న శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్ శనివారం వికారాబాద్‌కు వచ్చారు. తొలుత జిల్లా పోలీసు కేంద్ర కార్యాలయంలో ఎస్పీ నారాయణరెడ్డి, ఇతర అధికారులతో సమావేశమై.. లగచర్ల దర్యాప్తు తీరుపై ఆరా తీశారు. మిగతా నిందితుల అరెస్టుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులపై రైతులు, ప్రజలు దాడి చేయడానికి దారితీసిన పరిస్థితులు.. పోలీసులు వ్యవహరించిన తీరును ఆ సమయంలో ఘటనాస్థలిలో ఉన్న పోలీసులను అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు అధికారులు దాడికి ముందు.. ఆ తర్వాత పరిస్థితులను ఆయనకు వివరించారు. కీలక నిందితుడు సురేశ్‌రాజ్, మరో ముగ్గురి అరెస్టుకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. లగచర్ల, రోటింబడ తండా, పులిచర్ల తండా.. వాటి పరిసర గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన నేరుగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఘటన గురించి ఆయనను కూడా అడిగి తెలుసుకున్నారు. కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డిపై దాడి జరిగిన తీరు.. తాము దాడి నుంచి బయటపడిన విధానం గురించి కలెక్టర్ వివరించారు. అనంతరం మహేశ్ భగవత్ కలెక్టరేట్ నుంచి బయటకు వస్తుండగా మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించింది. దానికి ఆయన నిరాకరిస్తూ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని చెప్పారు.
కలెక్టర్‌కు భద్రత పెంపు
లగచర్ల దాడి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు హోంశాఖ భదత్ర పెంచింది. ప్రస్తుతం ఆయనకు ఉన్న 1+1 భద్రతను 2+2గా మార్చింది. అంటే.. ఆయనకు భద్రతగా సాయుధ బలగాల(ఏఆర్)కు చెందిన ఇద్దరేసి గన్‌మన్లు రెండేసి షిఫ్టుల్లో పనిచేస్తారు.