Share News

Health Care: వైద్యం లేదు.. రోగి లేడు

ABN , Publish Date - Nov 25 , 2024 | 02:27 AM

వైద్యుడు చికిత్స చేయలేదు. అసలు పేషంటే లేడు. కానీ.. తమకు ఆర్థిక సాయం చేయమంటూ ముఖ్యమంత్రి సహాయ నిధికి పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పైగా ఇవన్నీ వివిధ ఆస్పత్రుల నుంచి కాదు.. ఒకేదగ్గరి నుంచి అందినవి.

Health Care: వైద్యం లేదు.. రోగి లేడు

  • సీఎంఆర్‌ఎఫ్‌ కోసం బిల్లులు ప్రత్యక్షం.. ఒకే ఆస్పత్రి నుంచి 23 దరఖాస్తులు

  • ‘ఆన్‌లైన్‌’తో బయటపడిన అక్రమం

  • అక్రమాలు, అవినీతికి చరమ గీతం

  • నెరవేరుతున్న సీఎం రేవంత్‌ లక్ష్యం

  • గతంలోని అవకతవకలపై కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): వైద్యుడు చికిత్స చేయలేదు. అసలు పేషంటే లేడు. కానీ.. తమకు ఆర్థిక సాయం చేయమంటూ ముఖ్యమంత్రి సహాయ నిధికి పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పైగా ఇవన్నీ వివిధ ఆస్పత్రుల నుంచి కాదు.. ఒకేదగ్గరి నుంచి అందినవి. పేదలు, అర్హులకు సాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎ్‌ఫ)లో అక్రమాలు, అవినీతికి తావు లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి తీసుకువచ్చిన ఆన్‌లైన్‌ విధానంతో ఈ తతంగం బయటపడింది. పొందిన చికిత్స వివరాలను తెలుపుతూ పెట్టుకున్న అర్జీలను ఇటు సీఎంఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అటు ఆస్పత్రి యాజమాన్యం ధ్రువీకరించే క్రమంలో అక్రమం వెలుగులోకి వచ్చింది. ఒకే దవాఖానా నుంచి వచ్చిన 23 దరఖాస్తుల్లో కొన్నింటికి చెక్కులు సిద్ధం కాగా.. మిగిలినవాటి విచారణలో అవి నకిలీవని తేలింది. అప్రమత్తమైన ఆస్పత్రి యాజమాన్యం తమ వద్ద నుంచి సీఎంఆర్‌ఎఫ్‌ పోర్టల్‌లో ఎవరో నకిలీ బిల్లులను అప్‌లోడ్‌ చేశారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మంజూరైన చెక్కులను అధికారులు నిలిపివేశారు. కాగా, సీఎంఆర్‌ఎ్‌ఫలో అప్‌లోడ్‌ చేసిన నకిలీ బిల్లుల అంశం, వాటిని గుర్తించిన వివరాలన్నీ‘ఆంధ్రజ్యోతి’కి అందాయి.


  • ఇదీ విషయం..

ముఖ్యమంత్రి సహాయ నిధి అమలుకు గతంలో ఆన్‌లైన్‌ విధానం అందుబాటులో లేదు. ఏదైనా ఆస్పత్రి నుంచి చికిత్స పొందినట్లు బిల్లులతో అర్జీలు వస్తే.. నామమాత్ర పరిశీలనతో ప్రభుత్వం ఎంతో కొంత సాయం అందించేది. అయితే, ఇందులో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్‌ ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఈ మేరకు దరఖాస్తు నుంచి చెక్కు జారీ వరకు పారదర్శకత పాటిస్తున్నారు. ఆస్పత్రి, అక్కడ తీసుకున్న చికిత్స నిజమా? కాదా? అని లోతైన విచారణ జరిపిన తరువాతే సాయం అందిస్తున్నారు. కాగా, వరంగల్‌ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి దశల వారీగా వచ్చిన 23 దరఖాస్తులపై సీఎంఆర్‌ఎఫ్‌ విభాగం విచారణ జరిపే క్రమంలో.. వాటిల్లో పేర్కొన్నవారి పేర్లు, తీసుకున్న చికిత్స నిజమేనా అని యాజమాన్యాన్ని అడిగింది. వారు పరిశీలించగా అవి నకిలీ బిల్లులనీ, అసలు ఆ పేరున్న రోగులకు తాము చికిత్స చేయలేదని గుర్తించారు. ‘మా వద్ద చికిత్స తీసుకున్నవారు సీఎంఆర్‌ఎఫ్‌ కోసం బిల్లులు కోరితే సిద్ధం చేసిస్తాం. ఇలా 23 బిల్లులు విచారణకు రాగా 9 దరఖాస్తులకు అనుమతి లభించింది. 14 పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, వీరంతా మా ఆస్పత్రిలో అసలు చేరలేదని గుర్తించాం. ఆస్పత్రి రిసెప్షనిస్ట్‌ నకిలీ బిల్లులు, ల్యాబ్‌ రిపోర్టులను తయారుచేసినట్టు గుర్తించాం. అతడిపై చర్యలు తీసుకోండి’’ అంటూ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.


  • నెరవేరుతున్న సీఎం ఉద్దేశం

బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో సీఎంఆర్‌ఎ్‌ఫలో అక్రమాలు జరిగాయంటూ ప్రస్తుత ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించింది. సంబంధిత శాఖలు జిల్లాల్లోని ఆస్పత్రులకు వెళ్లి విచారణ జరుపుతున్నాయి. కొన్నిచోట్ల నకిలీ బిల్లులతో దరఖాస్తు చేసినట్లు తేలింది. ఇలాంటి ఆస్పత్రులకు బిల్లులు ఇచ్చే అవకాశం లేకుండా నిషేధిత జాబితాలో పెట్టారు. ఒకవేళ బిల్లులు వచ్చినా.. ఆన్‌లైన్‌ కారణంగా.. నిషేధిత జాబితాలో ఉన్నాయం టూ సీఎంఆర్‌ఎఫ్‌ వెబ్‌సైట్‌ చూపుతోంది. ‘ఆన్‌లైన్‌’ ద్వారానే తాజా అక్రమం వెలుగులోకి రావడంతో.. అర్హులకే సాయం అందాలన్న సీఎం రేవంత్‌ ఉద్దేశం నెరవేరుతోందని అఽధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, రేవంత్‌ సర్కారు సీఎంఆర్‌ఎఫ్‌ అన్‌లైన్‌ను జూన్‌ 15 నుంచి అమల్లోకి తెచ్చింది. దీనిపై ‘సీఎంఆర్‌ఎఫ్‌ ప్రక్షాళన’ శీర్షికన జూన్‌ 8న ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. ఇక అప్పటినుంచి 70,710 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 13 వేల అర్జీలకు చెక్కులను పంపిణీ చేశారు. 16 వేల చెక్కులు సిద్ధంగా ఉన్నాయి. విచారణ నిమిత్తం ఆస్పత్రుల పరిశీలనలో 13 వేల దరఖాస్తులుండగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.

Updated Date - Nov 25 , 2024 | 02:27 AM