Share News

Investment Scam: బై బ్యాక్‌ బురిడీ..

ABN , Publish Date - Nov 16 , 2024 | 05:09 AM

ఓపెన్‌ ప్లాట్లు, బంగారంపై పెట్టుబడులు పెడితే ‘బై బ్యాక్‌ పాలసీ’ కింద ప్రతి నెల రిటర్స్న్‌ ఇవ్వడంతో పాటు 25 నెలల్లో రెట్టింపు లాభాలు ఇస్తామని జనానికి ఆశపెట్టిందో ముఠా.

Investment Scam: బై బ్యాక్‌ బురిడీ..

  • నెలనెలా రిటర్న్స్‌.. రెట్టింపు లాభాలు

  • ప్లాట్లు, బంగారంపై ‘పెట్టుబడి’ వల

  • రూ.300 కోట్లు కొల్లగొట్టిన ముఠా

  • నిలువునా మునిగిన 3600 మంది

  • హైదరాబాద్‌లో 8 మంది అరెస్టు

  • ప్లాట్లు, బంగారంపై పెట్టుబడి పెడితే.. ప్రతి నెల రిటర్న్స్‌, రెట్టింపు లాభాలంటూ మోసం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఓపెన్‌ ప్లాట్లు, బంగారంపై పెట్టుబడులు పెడితే ‘బై బ్యాక్‌ పాలసీ’ కింద ప్రతి నెల రిటర్స్న్‌ ఇవ్వడంతో పాటు 25 నెలల్లో రెట్టింపు లాభాలు ఇస్తామని జనానికి ఆశపెట్టిందో ముఠా. 3,600 మంది నుంచి రూ.300 కోట్లు కొల్లగొట్టింది. సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ(ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌) డీసీపీ కె.ప్రసాద్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన కలిదిండి పవన్‌కుమార్‌, తన సహచరులు రావుల సత్యనారాయణ, బొడ్డు హరికృష్ణ, వల్లూరు భాస్కర్‌రెడ్డి, పగడాల రవికుమార్‌రెడ్డి, కొల్లాటి జ్యోతి, కూరళ్ల మౌనిక, కుర్కుల లావణ్యతో ‘12 వెల్త్‌ క్యాపిటల్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో సంస్థను ప్రారంభించాడు. బై బ్యాక్‌ పాలసీ కింద ఒక వ్యక్తి రూ. 8.8 లక్షలు పెట్టుబడి పెడితే 2 గుంటల మేర ఓపెన్‌ ప్లాటు వారి పేరున రిజిస్ట్రేషన్‌ చేస్తారు. బై బ్యాక్‌ పాలసీ కింద ప్రతి నెల రూ.32,000 చొప్పున 25 నెలలపాటు రిటర్స్న్‌ ఇస్తామని నమ్మించారు.


అంతేకాకుండా కొత్త కస్టమర్లను చేర్పించి వారితో పెట్టుబడి పెట్టిస్తే.. కమీషన్‌ కింద ప్రతి నెల రూ.7,200 చొప్పున 25 నెలలు అందిస్తామని నమ్మించారు. అయితే ఈ ముఠా డబుల్‌ గోల్డ్‌ స్కీమ్‌ అంటూ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద.. ఒక కస్టమర్‌ రూ.4లక్షలు పెట్టుబడిగా పెట్టి గోల్డ్‌ స్కీమ్‌లో చేరితే.. 12 నెలల్లోనే రూ.8లక్షల విలువైన బంగారం బిస్కెట్లు అందిస్తామని ముఠా నమ్మించింది. ఈ మేరకు రసీదులు, బాండ్లు రాసిచ్చారు. స్విట్జర్లాండ్‌ ముద్రతో బంగారం బిస్కెట్లు అందిస్తామని నమ్మించారు. తమకు తెలిసినవారు, స్నేహితులు, బంధువులతో పాటు కొంతమంది ఏజెంట్ల ద్వారా సుమారు 3600 మంది కస్టమర్ల నుంచి రూ. 300 కోట్లు సేకరించారు. నమ్మకం కోసం కొద్దిరోజులు రిటర్స్న్‌ ఇచ్చిన ముఠా ఆ తర్వాత ఇవ్వడం ఆపేసి బిచాణా ఎత్తేసింది. దీంతో బాధితులు సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. కేపీహెచ్‌బీకి చెందిన నాయని హరికాంత ఫిర్యాదు మేరకు ఈవోడబ్ల్యూ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు టీమ్‌ రంగంలోకి దిగి 8 మందితో కూడిన ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. ఇలాంటి స్కీములు నమ్మి ఎవరూ మోసపోవద్దని డీసీపీ సూచించారు.

Updated Date - Nov 16 , 2024 | 05:09 AM