Share News

Uttam: డిసెంబరులో ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక!?

ABN , Publish Date - Oct 12 , 2024 | 03:32 AM

కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడ ఏంటనేది డిసెంబరులో తేలనుంది. ఈ ప్రాజెక్టును కొనసాగించాలా, కొనసాగిస్తే ఎలా..? అన్న అంశాలపై డిసెంబరులోనే సమగ్ర నివేదిక ఇవ్వగలమని ‘జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్‌సఏ)’ అధికారులు తెలిపారు.

Uttam: డిసెంబరులో ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక!?

  • తేలనున్న కాళేశ్వరం మనుగడ

  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై 80ు పరీక్షలు పూర్తి!

  • ఢిల్లీలో మంత్రి ఉత్తమ్‌ కీలక చర్చలు

  • మంత్రి చిత్తశుద్ధికి ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌ ప్రశంసలు

న్యూఢిల్లీ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడ ఏంటనేది డిసెంబరులో తేలనుంది. ఈ ప్రాజెక్టును కొనసాగించాలా, కొనసాగిస్తే ఎలా..? అన్న అంశాలపై డిసెంబరులోనే సమగ్ర నివేదిక ఇవ్వగలమని ‘జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్‌సఏ)’ అధికారులు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ఎన్డీఎ్‌సఏ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ విజ్‌, కాళేశ్వరం బ్యారేజీ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ అయ్యర్‌లతో సమావేశమయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి మూడు జాతీయ ప్రయోగ శాలలు తమ పరీక్షల్ని దాదాపు 80 శాతం ముగించాయని, మరో 20 శాతం జరపాల్సి ఉందని అధికారులు మంత్రికి చెప్పినట్లు తెలిసింది.


మేడిగడ్డ వదిలేసినా కన్నెపల్లి వద్ద తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్వహించి, ఆయకట్టును నిలుపుకోవాలని భావిస్తున్నట్లు ఉత్తమ్‌ వారికి చె ప్పారు. వార్ధాపై బ్యారేజీతో పాటు ప్రాణహితపై తుమ్మిడిహట్టికి దిగువన రబ్బర్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన గురించి ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ రెండింటి నీళ్లను గ్రావిటీ ద్వారా సుందిళ్లకు తరలించి ఎల్లంపల్లిలోకి పంపింగ్‌ చేయాలనుకుంటున్నట్లు ఆయన వివ రించారు. మేడిగడ్డ తప్ప అన్ని ఇతర నిర్మాణాలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఏదైనా తుది నివేదికల ద్వారానే సాధ్యమని ఎన్డీఎ్‌సఏ అధికారులు చెప్పినట్లు తెలిసింది. భూపరీక్షలు చేసిన తర్వాతే తుది నివేదిక ఇవ్వగలమని ఎన్డీఎ్‌సఏ అధికారులు చెప్పారు. గతంలో తాము చెప్పిన పరీక్షలను చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆలస్యం చేశారని, ఈలోపు వర్షాకాలం వచ్చిందని కేంద్ర అధికారులు చెప్పినట్లు సమాచారం.


కొన్ని చోట్ల చేసిన మరమ్మతులపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా ఎన్డీఎ్‌సఏకు లేఖ రాసి ఆగమేఘాలపై ఈ సమావేశం ఏర్పాటు చేయమని కోరడంతో అధికారులు దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులను పిలిచి సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో మూడు బ్యారేజీల విషయంలో దాదాపు అన్ని విషయాలను క్షుణ్ణంగా చర్చించారు. బ్యారేజీలు కొట్టుకుపోయే అవకాశాలు లేవని తాము చెప్పామని ఎన్డీఎస్‌ఏ అఽధికారులు అన్నట్లు తెలిసింది. ఉత్తమ్‌ తండ్రి మరణించిన విషయాన్ని తెలుసుకుని సమావేశంలో ఎన్డీఎ్‌సఏ చైర్మన్‌ తీవ్ర సంతాపం తెలిపారు. గురువారం తండ్రి పెద్ద కర్మ జరిగిన వెంటనే ఉత్తమ్‌ ఈ సమావేశానికి రావడం ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తోందని ప్రశంసించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో కనీసం రెండు బ్యారేజీలనైనా కాపాడగలిగితే రైతాంగానికి మేలు జరుగుతుందని, తాము సాధ్యమైనంత త్వరలో పరీక్షలు పూర్తి చేసి తుది నివేదికలు సమర్పిస్తామని సమావేశంలో అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

Updated Date - Oct 12 , 2024 | 03:32 AM