5,942 కోట్లతో వంతెనలు, అండర్‌పాస్‌లు
ABN , Publish Date - Dec 06 , 2024 | 04:18 AM
గ్రేటర్ హైదరాబాద్ రహదారుల్లో రయ్, రయ్‌మని దూసుకెళ్లేలా.. సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా పలు ప్రాజెక్టులు నిర్మించనున్నారు.
పాతబస్తీ నుంచి ఐటీ కారిడార్ వరకు
నలువైపులా ప్రాజెక్టులు పురపాలక శాఖ అనుమతి
ఆగకుండా సాగిపోయేలా వంతెనలు, అండర్‌పా్‌సలు
హెచ్-సిటీలో భాగంగా రూ.5942 కోట్లతో నిర్మాణం
అనుమతులిచ్చిన పురపాలక శాఖ
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ రహదారుల్లో రయ్, రయ్‌మని దూసుకెళ్లేలా.. సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా పలు ప్రాజెక్టులు నిర్మించనున్నారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) ప్రాజెక్టులో భాగంగా పాతబస్తీ మొదలు ఐటీ కారిడార్ వరకు నగరం నలువైపులా ప్రాజెక్టులు చేపట్టనున్నారు. 23 ప్రాంతాల్లో వంతెనలు, అండర్‌పా్‌సలు, రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌వోబీ), రోడ్ అండర్ బ్రిడ్జి (అర్‌యూబీ)లు, గ్రేడ్ సెపరేటర్ల (చౌరస్తా వద్ద ఓ వైపు నుంచి వెళ్లే వాహనాలు కుడి/ఎడమ వైపునకు వెళ్లేలా నిర్మించేది) నిర్మాణానికి పురపాలక శాఖ పచ్చజెండా ఊపింది. రూ.5942 కోట్లతో చేపట్టనున్న పనులకు పాలనాపరమైన అనుమతులు జారీ చేస్తూ గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి.
ఆయా పనులకు గత ఏడాది సెప్టెంబరులో రూ.4305 కోట్లతో అనుమతి ఇవ్వగా.. నిర్మాణ సామగ్రి, ఇతరత్రా ధరలు పెరిగిన నేపథ్యంలో అంచనా వ్యయం రూ.5942 కోట్లకు (రూ.1637 కోట్లు అదనం) పెంచుతూ పంపిన ప్రతిపాదనలకు పురపాలక శాఖ ఆమోదం తెలిపింది. ఐదు ప్యాకేజీల్లో పనులు చేపట్టనున్నారు. గ్రేటర్‌లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. వాహనాల సంఖ్య భారీగా పెరగడం.. ఆ స్థాయిలో రహదారుల వ్యవస్థ మెరుగవకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రహదారులను మెరుగుపర్చడంపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ప్రకటించిన మూడు రోజుల్లోనే..
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హెచ్-సిటీలో చేపట్టనున్న రూ.3446 కోట్ల పనులకు ఇటీవల సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఎల్‌బీనగర్, చార్మినార్ జోన్లలో 5 ప్యాకేజీల కింద చేపట్టనున్న పనులకు నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. 3 రోజుల్లోనే ఈ పనులకు అనుమతులిచ్చారు. పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు జీహెచ్‌ఎంసీ వర్గాలు తెలిపాయి.