Share News

Dharani: నిర్దిష్ట గడువులోగా ‘ధరణి’ సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Nov 29 , 2024 | 03:11 AM

నూతన రెవెన్యూ చట్టాన్ని(ఆర్వోఆర్‌-2024) తీసుకురాబోతున్న వేళ ధరణి పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ధరణిలో పెండింగ్‌లో ఉన్న పలు దరఖాస్తులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా అధికారులను ఆదేశించింది.

Dharani: నిర్దిష్ట గడువులోగా ‘ధరణి’ సమస్యల పరిష్కారం

  • పలు మాడ్యూల్స్‌పై సీసీఎల్‌ఏ కొత్త మార్గదర్శకాలు

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నూతన రెవెన్యూ చట్టాన్ని(ఆర్వోఆర్‌-2024) తీసుకురాబోతున్న వేళ ధరణి పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ధరణిలో పెండింగ్‌లో ఉన్న పలు దరఖాస్తులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను సవరించి భూపరిపాలనా కమిషనర్‌(సీసీఎల్‌ఏ) నవీన్‌ మిత్తల్‌ గురువారం నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. అలాగే, ధరణిలోని పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కాగా,ధరణి మాడ్యుల్‌లో టీఎం-3 కింద మ్యుటేషన్‌ కోసం వచ్చిన దరఖాస్తులను, టీఎం-24 కింద కోర్టు కేసు ద్వారా పట్టాదారు పాస్‌ పుస్తకం కోసం వచ్చిన దరఖాస్తులు, టీఎం-31 పట్టాదారు పాస్‌పుస్తకం జారీ అయ్యాక లేదా నాలా కన్వర్షన్‌ అయ్యాక ఇల్లు, ఇంటి స్థలం రికార్డుల సవరణకు వచ్చే దరఖాస్తులు, టీఎం-33 కింద పాస్‌పుస్తకంలో తప్పుల సవరణకు వచ్చే దరఖాస్తులను, పేరు మార్పు వంటి వాటిపై అదనపు కలెక్టర్లు(రెవెన్యూ) మూడు రోజుల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.


తహసీల్దారు, ఆర్డీవో చేసిన సిఫారసుల ఆధారంగా అదనపు కలెక్టర్లు ఆయా దరఖాస్తుల ఆమోదం లేదా తిరస్కరణపై మూడు రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. ఒక వేళ ఏదైనా దరఖాస్తును తిరస్కరిస్తే అందుకు కారణాన్ని అదనపు కలెక్టర్లు స్పష్టం చెయ్యాలి. కాగా, టీఎం-4 మాడ్యుల్‌ కింద వచ్చే పట్టాదారు పాస్‌పుస్తకం లేకుండా వారసత్వంగా వచ్చే అసైన్డ్‌ భూములు, టీఎం-27 పెండింగ్‌ నాలా దరఖాస్తులు, టీఎం-33 సర్వే నంబరు కాపీల మీద డిజిటల్‌ సంతకం కోసం వచ్చే దరఖాస్తులు, జీఎల్‌ఎం మాడ్యుల్‌ గ్రీవెన్స్‌ ఫర్‌ ల్యాండ్‌ మ్యాటర్‌- కింద సర్వే నంబరు పత్రాల మీద డిజిటల్‌ సంతకం కోసం వచ్చే దరఖాస్తులపై ఆర్డీవో స్థాయిలో తుది నిర్ణయం తీసుకోవాలి. ఆయా మాడ్యుల్స్‌ కింద ఉన్న పెండింగ్‌ దరఖాస్తులపై కలెక్టర్‌ స్థాయిలో 7 రోజులు, అదనపు కలెక్టర్‌ స్థాయిలో మూడు రోజులు, ఆర్డీవో స్థాయిలో మూడు రోజులు, తహసీల్దార్‌ స్థాయిలో ఏడు రోజుల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని గతంలో ఇచ్చిన ఆదేశాలనే తాజా సర్క్యులర్‌లో సీసీఎల్‌ఏ ప్రస్తావించారు. కాగా, ‘ధరణి’ పెండింగ్‌ దరఖాస్తులు 3.49 లక్షల ఉండగా వాటిలో 2.35 లక్షల దరఖాస్తులను ఇప్పటిదాకా అధికారులు పరిష్కరించారు. ఇంకా లక్షా 5వేల దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంది.

Updated Date - Nov 29 , 2024 | 03:11 AM