Sitarama Project: తక్షణమే సంజాయిషీ ఇవ్వండి
ABN , Publish Date - Nov 05 , 2024 | 03:34 AM
సీతారామ ఎత్తిపోతల పథకం టెండర్ల వివాదంలో నీటిపారుదలశాఖ అధికారుల ప్రవర్తనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు.. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా.. క్రమశిక్షణ రాహిత్యం, దుష్ప్రవర్తనపై వెంటనే సంజాయిషీ ఇవ్వాలంటూ జి.అనిల్‌కుమార్‌తో పాటు కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివా్‌సరెడ్డికి ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.
ఈఎన్‌సీ, కొత్తగూడెం సీఈకి నీటిపారుదల శాఖ తాఖీదులు
సెలవు పెట్టి వెళ్లిపోవాలని సీఈకి సూచించిన మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): సీతారామ ఎత్తిపోతల పథకం టెండర్ల వివాదంలో నీటిపారుదలశాఖ అధికారుల ప్రవర్తనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు.. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా.. క్రమశిక్షణ రాహిత్యం, దుష్ప్రవర్తనపై వెంటనే సంజాయిషీ ఇవ్వాలంటూ జి.అనిల్‌కుమార్‌తో పాటు కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివా్‌సరెడ్డికి ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. క్రమశిక్షణారాహిత్యం, దుష్ప్రర్తనపై సంజాయిషీ ఇవ్వాలని వారిని నిర్దేశించారు. అధికారులు ఇద్దరూ సంజాయిషీ ఇచ్చాకా తదుపరి చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు గత శనివారం సీతారామ ప్రాజెక్టుపై జలసౌధలో నిర్వహించిన సమీక్షలో.. ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్‌పై సీఈ శ్రీనివా్‌సరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడటం విమర్శలకు తావిచ్చిుంది.
పరిపాలన అనుమతులు లేకుండా టెండర్లు ఏ విధంగా పిలిస్తారని, సీవోటీ ఆమోదం ఏ విధంగా లభిస్తుందని ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ ప్రశ్నించగా... తాను ఏడేళ్లు సీవోటీలో పనిచేసిన సమయంలో పాలనాపరమైన అనుమతి లేని టెండర్లను కూడా ఆమోదించానని సీఈ బదులిచ్చారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మొదలైన వాదన క్రమంగా ఏకవచన ప్రయోగానికి దారి తీసింది. నువ్వంటే... నువ్వు అనే అనే రీతిలో వీరి మధ్య వాగ్వావాదం జరగ్గా... ఓ దశలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోక్యం చేసుకొని ‘నోరు మూసుకోండి’ అంటూ ఇద్దర్నీ వారించారు. అనంతరం.. ‘నిబంధనలు అతిక్రమించినట్లు తేలితే చర్యలు తప్పవు... వెంటనే సెలవులో వెళ్లిపోండి’ అని కొత్తగూడెం సీఈకి వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరి ప్రవర్తనా ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, వీరిపై తగిన చర్యలు తీసుకోవాలనిరాహుల్‌బొజ్జాను ఆదేశించారు.